రాజధానిలో భారీ/మధ్యతరహా షాపింగ్‌మాల్స్ సుమారు 1500 వరకూ ఉన్నాయి. వీటిలో వస్త్రాల విక్రయాలకు సంబంధించినవే 900 ఉన్నాయని అంచనా. హోటళ్లు అంతకు మించే ఉన్నాయి. సాధారణంగా స్నానాల గదులు, దుస్తులు మార్చుకునే(ట్రయల్‌రూం) గదుల్లో ఎక్కువగా సూక్ష్మ/అత్యాధునిక కెమెరాలను అమర్చేందుకు అవకాశాలుంటాయి. దిల్లీ, ముంబయి, బెంగళూరులోని కొన్ని ప్రముఖ షోరూంలు, బ్రాండెడ్ వస్త్ర దుకాణాల్లో రహస్య కెమెరాలున్నాయని కొన్ని నెలల కిందట కొందరు మహిళలు ఆయా యజమానుల దృష్టికితీసుకెళ్లారు. ‘‘కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ శివార్లలోని రెండు షాపింగ్‌మాల్స్ ట్రయల్‌రూంల వద్ద కొందరు అనుమానాస్పదంగా తచ్చాడుతుండడంపై ఇటీవల ఇద్దరు యువతులు యజమానికి ఫిర్యాదు చేశారు. వినియోగదారులు ఆగ్రహించి అనుమానితులను పట్టుకుని చితకబాదారు. ఆయా ప్రాంగణాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారే వాటిని అమరుస్తున్నట్టు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఘటనల్లో నిరూపితమైంది. హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటనతో షాపింగ్ మాళ్లలో మహిళలకు వ్యక్తిగత భద్రత లేదనే అంశం తేటతెల్లమైందని’ మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎవరో ఫిర్యాదు చేసినప్పుడే హడావుడి చేయడం కాకుండా మూకుమ్మడి తనిఖీలు నిర్వహించడం ద్వారా పోలీసులు మహిళలకు భరోసా కల్పించాలని కోరుతున్నాయి.
ఫిర్యాదుచేస్తే వెంటనే స్పందిస్తాం
వస్త్ర దుకాణాల్లో దుస్తులు మార్చుకునేందుకు వెళ్లే సమయాల్లో లోపల ఒకసారి గమనించండి. అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వివరాలు గోప్యంగా ఉంచుతాం.
- ఎ.ఆర్.శ్రీనివాస్, సంయుక్త కమిషనర్