కరోనా విజృంభణ నేపథ్యంలో నిలిచిపోయిన మెట్రో రైళ్లు ఈ నెల 7 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. మార్చి 22 నుంచి సుమారు 5 నెలలకు పైగా మెట్రో సేవలు నిలిచిపోయాయి. అన్లాక్-4లో భాగంగా దేశంలో మెట్రో రైళ్ల నిర్వహణకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో గ్రేడెడ్ పద్ధతిలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినట్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో రైళ్ల పున ప్రారంభం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేశంలోని అన్ని మెట్రోల ఎండీలతో మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.
మెట్రో సర్వీసులు నిర్వహణపై కేంద్రం ఇచ్చే నిబంధనల ప్రకారం నడుపుతామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రోలో కరోనా వ్యాప్తి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా... సీట్ల మధ్య ఖాళీ ఉంచనున్నారు. ప్రారంభంతోనే... ఎక్కువ సంఖ్యలో సర్వీసులు నడపకుండా... రద్దీని బట్టి నడిపే అవకాశం ఉంది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. స్టేషన్లలోకి ప్రవేశించే సమయంలో నిర్వాహకులు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు.