కరోనా విపత్కర సమయంలో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్- మెయిల్ సంస్థ... తన ఉదారతను చాటుకునేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు వైద్య ఆక్సిజన్‌ను ఉచితంగా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మెయిల్ సంస్థ ప్రకటించింది. వివిధ ఆసుపత్రులలో ఉన్న రోగుల అవసరాలను తీర్చడానికి 35 లక్షల లీటర్ల వైద్య ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలను కంపెనీ చేపడుతోందని మెఘా వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాలకు ప్రాణవాయువు అందించేందుకు 'మేఘా' సిద్ధం - మెయిల్ సంస్థ
కరోనా మహమ్మారి బారినపడి ఎంతో మంది బాధితులు... ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్న వేళ ప్రాణవాయువును అందించేందుకు మెఘా సంస్థ ముందుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు ఆక్సిజన్ అందించేదుకు సిద్ధంగా ఉన్నట్లు మెఘా ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సంస్థ స్పష్టం చేసింది.
![తెలుగు రాష్ట్రాలకు ప్రాణవాయువు అందించేందుకు 'మేఘా' సిద్ధం megha engineering and constructions company](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11687956-456-11687956-1620478686493.jpg)
ఆస్పత్రులు, ప్రభుత్వ అధికారులు, డీఆర్డీఓ అధికారులతో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఒక్కో సిలిండర్ 7,000 లీటర్లు చొప్పున రోజుకు 500 సిలిండర్లను సరఫరా చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. రోజుకు 35 లక్షల లీటర్ల ఆక్సిజన్ మేఘా సంస్థ ఆసుపత్రులకు సరఫరా చేస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఎంఈఐ.ఎల్ పరిశ్రమలో 10నుంచి 15 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు తయారు చేస్తుందని సంస్థ తెలిపింది. స్పెయిన్ నుంచి రెండు నుంచి మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు దిగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.