సంప్రదాయాలే భారతీయులంతా ఒకటేననే భావం కలిగిస్తాయి: చిరంజీవి National Cultural Festival: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జాతీయ సంస్కృతి మహోత్సవాలు రెండో రోజు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా పంచాగశ్రవణం నిర్వహించారు. సెలవు, ఉగాది పండుగ నేపథ్యంలో వేడుకలకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలివచ్చారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్‌వి రవి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్... పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలగు సినిమా స్థాయి పెరిగింది..: ప్రపంచంలోనే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఒకే ఒక దేశం భారతదేశామని చిరంజీవి పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలే భారతీయులంతా ఒకటేననే భావం కలిగిస్తాయన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలన్న చిరంజీవి... ప్రస్తుతం తెలుగు భాష చిత్రాల స్థాయి పెరిగిందన్నారు.
జెండా పండుగ..:జాతీయ సంస్కృతి మహోత్సవంలో కళను, వృత్తిని నమ్ముకున్న పేద కళాకారులకు మాత్రమే అవకాశం కల్పించామని... కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో పెద్ద పెద్ద కళాకారులు ఎవ్వరూ లేరన్నారు. అందరూ మారుమూల గ్రామాల నుంచి వచ్చిన నిరుపేద కళాకారులని.. వారి ప్రోత్సహించాలని కోరారు. యోగాను ఇప్పుడు కేవలం భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆగస్టు 15న దేశంలోని కోట్లాది మంది ఇళ్ల ముందు జాతీయ జెండా ఎగరాలని.. పండగల మాదిరిగా జెండా పండుగను ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని సూచించారు.
మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు వేయి మందికి పైగా కళాకారులు పాల్గొని తమ ప్రతిభను, ఆయా రాష్ట్రాలకు చెందిన నృత్యరీతులను ప్రదర్శించి వీక్షకులను మెప్పించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది కళాకారులు పాల్గొన్నారు.
ఇదీచూడండి:ఆచార్య ట్రైలర్ అప్డేట్.. ఆ సినిమాలో రష్మిక ఫిక్స్