ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల విక్రయం, ధరలు, షోలపై సర్కారు కొత్త చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఆచితూచి స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Chiranjeevi on cinema tickets rates in AP: సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అలాగే పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం పట్ల చిరు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో టికెట్ ధరలపై తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. దేశమంతా ఒకటే జీఎస్టీ పన్నులు వసూలు చేస్తున్న తీరును ఉదహరించిన చిరంజీవి... టికెట్ ధరల్లో కూడా అదే వెసులుబాటు కల్పించాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగానే ఏపీలోనూ టికెట్ ధరలను నిర్ణయిస్తే సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు.
థియేటర్ల మనుగడ కోసం, సినిమాపై ఆధారపడ్డ కుటుంబాల కోసం ఏపీ ప్రభుత్వం(cinema tickets through online in ap) ఆలోచించాలని మెగాస్టార్ చిరు సూచించారు. ప్రభుత్వ ప్రోత్సహం ఉన్నప్పుడే తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని అభిప్రాయపడ్డారు.
అందుకే ఆన్‌లైన్ విధానం: పేర్ని నాని
ఇప్పటి వరకు థియేటర్ యజమానుల ఇష్టానుసారం టికెట్ల విక్రయాలు జరిగేవని.. ప్రజలను దోచుకునే పరిస్థితిని నియంత్రించేందుకే ఆన్‌లైన్ విధానం(AP cinema tickets online) తీసుకొచ్చామని నిన్న మంత్రి పేర్ని నాని వివరించారు. బస్సు, రైలు, విమాన టికెట్ల తరహాలోనే సులభతరంగా సినిమా టికెట్ల విక్రయం జరిగేలా చూస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 1100 థియేటర్లలో ఆన్లైన్లో టికెట్ విక్రయాలు చేపడతామని స్పష్టం చేశారు. సినిమా విడుదల సమయంలో టికెట్ల ధర బ్లాక్‌లో రూ.200 నుంచి రూ.1000 వరకు విక్రయించే విధానం గతంలో ఉండేదని.. అధిక ధరలకు టికెట్లు విక్రయించకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జీవో 35 ప్రకారం బెనిఫిట్ షోలకు ప్రత్యేక అనుమతి ఉంటుందని.. చారిటీస్ కోసం మాత్రమే ఈ షోలకు అనుమతి ఇస్తామని చెప్పారు.
మిగిలినవన్నీ దొంగ ఆటలే
ఆంధ్రప్రదేశ్ సినిమాల (క్రమబద్ధీకరణ) చట్టానికి సవరణ బిల్లును ఏపీ శాసనసభ బుధవారం ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చట్టం వచ్చినప్పటి నుంచి రోజుకు నాలుగు షోలకే అనుమతి ఉందని, అవి కాకుండా మిగతావన్నీ దొంగ ఆటలేనని పేర్ని నాని అన్నారు. తామేమీ కొత్తగా అదనపు షోలను నిషేధించడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసి ఇలాంటి ఆటలు కొనసాగించారని పేర్కొన్నారు.
వాళ్లకు అభ్యంతరం లేదు
గంటముందు సినిమాహాళ్లలోనూ ఆన్‌లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తారని పేర్ని అన్నారు. నిర్మాతలు చెప్పే వసూళ్ల లెక్కలకు, ప్రభుత్వానికి జమ అయ్యే పన్ను రాబడికి మధ్య పొంతన లేదని చెప్పారు. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలతో పన్ను మొత్తం వసూలవుతుందని స్పష్టం చేశారు. ఈ విధానంపై సినిమా హాళ్ల యజమానులు, పంపిణీదారులు, నిర్మాతలకు అభ్యంతరం లేదని వివరించారు. అయినా కొన్ని పార్టీలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని.. సినిమా హాళ్ల డబ్బు పోగేయడం, రెండు మూడు నెలల తర్వాత చెల్లించడం, రుణాలు తెచ్చుకోవడం లాంటి ఆలోచనలేవీ ప్రభుత్వానికి లేవని వెల్లడించారు.
ఇదీ చదవండి:మంత్రి సీడీ కేసులో కమిషనర్‌కు చిక్కులు- దర్యాప్తునకు కోర్టు ఆదేశం