EWS Reservations: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులో మీసేవ మార్పులు చేయనుంది. ఈమేరకు మార్పులను సూచిస్తూ రెవెన్యూశాఖ, సీసీఎల్‌ఏ.. మీసేవ కమిషనర్‌కు లేఖ రాశాయి. రూ.8 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, రెసిడెన్షియల్ ఫ్లాట్‌లకు సంబంధించి కొన్ని షరతులు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని సడలించి అన్ని రకాలుగా కుటుంబ ఆదాయం రూ. 8 లక్షలు మించరాదని పేర్కొంది. ఈమేరకు 2021 ఆగస్టు 24న సమగ్ర విధివిధానాలతో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మీసేవ ద్వారా తీసుకునే దరఖాస్తులో మాత్రం మార్పులు చేయలేదు.
రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్న తరుణంలో పలువురు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో దరఖాస్తుతో పాటు ధ్రువపత్రంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా మీసేవ కమిషనర్‌కు సీసీఎల్‌ఏ లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలోని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం అని దరఖాస్తులో విడిగా పొందుపర్చాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ల కోసం ప్రస్తుతం ఉన్న దరఖాస్తు యథావిధిగా కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోసం చేసే దరఖాస్తులో ఆస్తుల వివరాల విభాగాన్ని తొలగించనున్నారు. ఐదెకరాల వ్యవసాయభూమి, ఫ్లాటు, ప్లాటు వివరాల విభాగాన్ని కూడా తొలగించనున్నారు. ధ్రువపత్రంలోనూ ఆస్తుల వివరాలకు సంబంధించిన విభాగం లేకుండా మార్పులు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అందుకు అనుగుణంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సర్వీసులోని దరఖాస్తులో మార్పులు చేయాలని మీసేవకు స్పష్టం చేసింది.