వరంగల్‌కు చెందిన ఓవ్యాపారి కుటుంబంలో ఐదుగురు జులైలో కరోనా బారినపడ్డారు. ఆ వ్యాపారితో పాటు ఆయన తల్లిదండ్రులు మధుమేహం, అధిక రక్తపోటుకు మందులు వాడుతున్నారు. అందరూ ఇంట్లోనే కొవిడ్ చికిత్స పొందారు. 4 వారాల పాటు ఔషధాలు వాడారు. ఇందులో ముగ్గురికి ఫావిపిరావిర్ మాత్రలను వినియోగించారు. వీటికి ప్రత్యేకంగా రూ.25 వేలు కాగా, మొత్తంగా ఐదుగురికి రూ.45 వేలకు పైగా ఖర్చయింది. ఇవి కాకుండా 2 పల్స్ ఆక్సిమీటర్లకు రూ.6 వేలు వెచ్చించారు. ఇప్పటికీ విటమిన్ మాత్రలు వాడుతూనే ఉన్నారు.
హైదరాబాద్‌లో ముగ్గురు సభ్యులున్న కుటుంబంలో 5 నెలలుగా విటమిన్ సి, మల్టీవిటమిన్, జింకు, విటమిన్ డి.. మాత్రలు వాడుతున్నారు. ఇప్పటివరకూ ఆ కుటుంబంలో ఎవరూ కొవిడ్ బారిన పడలేదు. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్యుల సూచనల మేరకు విటమిన్ మాత్రలను వాడుతున్నారు. కేవలం వీటికోసం నెలకు రూ.1500కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంకా ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్, వేపరైజర్ పరికరాలు కొన్నారు. మాస్కులు, శానిటైజర్లకు ఎంత ఖర్చు చేశారో లెక్కేలేదు.
కరోనా దెబ్బకు ఔషధాలు నిత్యావసరాలుగా మారాయి. ప్రతి ఒక్కరూ విరివిగా మందులు వాడారు. మహమ్మారి బారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు స్తోమతకు మించి ఖర్చు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ 5 నెలల్లో కొవిడ్ సంబంధిత ఔషధాలు.. వైద్య పరికరాల కోసం దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా వ్యయం చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో విటమిన్ మాత్రలు, యాంటీ బయాటిక్స్ తదితరాల కోసమే సుమారు రూ.3 వేల కోట్లు వెచ్చించగా.. పల్స్ ఆక్సిమీటర్ల కోసం రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ సహా జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి నుంచి ఉన్నతవర్గాల వరకూ.. ఒక్కో కుటుంబం 5 నెలల్లో దాదాపు రూ.15 వేల నుంచి 20 వేల వరకూ ఆర్థిక భారాన్ని మోసినట్లు తెలుస్తోంది.
విపరీతంగా పెరిగిన విక్రయాలు
రాష్ట్రంలో మార్చి 2న తొలి కొవిడ్ కేసు నమోదైంది. ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో వైరస్ విజృంభించింది. ఈ సమయంలో ప్రజలు స్వీయ జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. కరోనా వచ్చినా, రాకున్నా.. ఇంటిల్లిపాదీ విటమిన్ మాత్రలను వాడారు. ముందు జాగ్రత్తగా పల్స్ ఆక్సిమీటర్లను, థర్మామీటర్లను కొన్నవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీంతో కొవిడ్ సంబంధ ఔషధాలు, వస్తువుల విక్రయాలు 10 నుంచి 15 రెట్లు పెరిగాయి. ఇదే అదనుగా కొన్ని నాసిరకం మందులు, ఆక్సిమీటర్లు, వేపరైజర్లు విపణిలోకి వచ్చాయి. వీటిపై ఔషధ నియంత్రణాధికారుల పర్యవేక్షణ లోపించిందనే విమర్శలున్నాయి.
విటమిన్ గోలీలు
ఒక సాధారణ మందుల షాపులో.. విటమిన్ సి, డి 3, జింక్, బీ కాంప్లెక్స్ మాత్రలు నెల మొత్తంలో సుమారు రూ.30-40 వేలు అమ్ముడయ్యేవి. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో ఏకంగా నెలకు రూ.3 లక్షలకు పైగా వీటి వ్యాపారం పెరిగింది. రాష్ట్రంలో సాధారణంగా విటమిన్ సి, డి మాత్రల అమ్మకాలు నెలకు రూ.20-30 కోట్లు ఉండగా.. కొవిడ్ కాలంలో రూ.70 నుంచి 80 కోట్ల రూపాయలకు పెరిగాయి. జింక్ మాత్రలు కరోనాకు ముందు నెలకు రూ.50-60 కోట్ల మేర విక్రయిస్తుండగా.. అ సమయంలో రూ.150 కోట్ల వరకూ వెళ్లిందని ఔషధ వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఒక దశలో కొన్ని ఔషధ ఉత్పత్తి సంస్థలు విటమిన్ మాత్రలు పూర్తిగా ఆరకముందే పంపించిన దాఖలాలు ఉన్నాయని ఓ ఔషధ దుకాణదారు తెలిపారు.
పారాసిటమాల్
ఈ మాత్రలు కరోనాకు ముందు నెలకు సుమారు రూ.70 కోట్లు విక్రయిస్తుండగా.. కొవిడ్ కాలంలో వీటి అమ్మకాలు రూ.100-120 కోట్లకు పెరిగాయి. ఇంకా అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ అమ్మకాలు కూడా సాధారణంగా నెలకు రూ.100-150 కోట్లుండేవి. కొవిడ్ సమయంలో ఏకంగా రూ.400-500 కోట్ల అమ్మకాలు జరిగాయి.