కరోనా కట్టలు తెచ్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మెడికల్ ఆక్సిజన్ అవసరం అంతకంతకూ పెరుగుతోంది. ఈ దశలో ప్రాణవాయువు కొరత లేకుండా చూడాలన్న కేంద్రం.. ఉత్పత్తి పెంచాలని ఉక్కు కర్మాగారాలన్నింటికీ ఆదేశాలిచ్చింది. సెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్, జెఎస్పీఎల్, జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉక్కు కర్మాగారాలు.. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను.. యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి చేస్తున్నాయి.
కరోనా బాధితులను కాపాడటంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారానిది ప్రముఖ స్థానం. గతేడాది.. కరోనా విజృంభించిన వేళలోనూ.. నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేసిన ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్‌దే. కింగ్ జార్జ్ ఆసుపత్రితో పాటు సమీప యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి మరింత ఉద్ధృతం కాగా.. ఆక్సిజన్ ఉత్పత్తి మరింత పెంచాలని కేంద్రం అన్ని స్టీల్ ప్లాంట్లనూ ఆదేశించింది. ఈసారీ ఆక్సిజన్ సరఫరాకు సన్నద్ధంగా ఉన్నామని కర్మాగార సిబ్బంది చెబుతున్నారు.