తెలంగాణ

telangana

ETV Bharat / city

పెద్దదిక్కు ప్రాణాలు హరించి.. కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసి - covid effect on meddle class families

ఆ ఇంటికి ఆయనే పెద్దదిక్కు. భార్య పిల్లలతో హాయిగా జీవించేవాడు. చేసేది డ్రైవర్ ఉద్యోగం. పిల్లలను బాగా చదివించి ఉన్నతస్థితిలో చూడాలని కలలు కనేవాడు. కానీ ఆ కలలతోపాటు.. తనను కరోనా కబళిస్తుందని ఊహించలేకపోయాడు. కొవిడ్‌ బారినపడినా.. బతుకుతాని ధైర్యంగా ఉండేవాడు. కానీ... మహమ్మారి ఆ ధైర్యాన్ని చంపేసింది. తండ్రిని బతికించుకునేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే 2 గంటలు ఆలస్యంగా వచ్చింది. దారిలోనే కన్నుమూశాడు. మగదిక్కు లేక ఒంటరైనా ఆ కుటుంబం బతికే ధైర్యాన్ని ఇవ్వమని వేడుకుంటోంది. హైదరాబాద్‌ మల్లాపూర్ న్యూభవానీ నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్ డ్రైవర్ ఇంట కరోనా మిగిల్చిన విషాదకర సంఘటన ఇది..

meddle class families suffering with lost family members due to corona
పెద్దదిక్కు ప్రాణాలు హరించి.. కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసి

By

Published : May 26, 2021, 4:55 AM IST

పెద్దదిక్కు ప్రాణాలు హరించి.. కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసి

కనిపించని శత్రువుతో యుద్ధం. ఎన్ని రకాల ఆయుధాలు ఎక్కుపెట్టినా ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఎలా దెబ్బతీస్తుందో కానరాదు. ఉన్నట్టుండి ఊపిరితీసేస్తోంది. ఆ పోరాటంలో బంధాలు తెగిపోతున్నాయి. అనుబంధాలు ఆవిరైపోతున్నాయి. పెద్దదిక్కు లేక కుటుంబాలు ఆగమైపోతున్నాయి. ఒంటరిని చేసి వెళ్లిన భర్తను తలుచుకుంటూ భార్య, దూరమైన తండ్రిని గుర్తుచేసుకుంటూ చిన్నారులు... నిత్యం వేదన అనుభవిస్తున్నారు. ఇలాంటి విషాదకర సంఘటనే 20 రోజుల కిందట హైదరాబాద్‌ మల్లాపూర్‌లోని న్యూభవానీనగర్‌లో నివసిస్తున్న వీఎస్​ఆర్​ కృష్ణ ఇంట జరిగింది..

అంబులెన్స్ రావడానికి రెండు గంటలు పట్టింది..

ప్రైవేట్‌ పాఠశాలలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కృష్ణకు.. భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పాఠశాల సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కృష్ణ పనిచేసే పాఠశాలలోనే ఇద్దరు చిన్నారులను చదివిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. హాయిగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి.. కరోనా వైరస్ ప్రవేశించింది. కృష్ణతోపాటు ఆయన భార్య ఉషశ్రీ.. వైరస్‌ బారినపడ్డారు. ఉషశ్రీ మందులు వాడుకుంటూ మెల్లగా కోలుకోగా.. కృష్ణ ఆరోగ్యం దెబ్బతింది. క్రమంగా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతూ వచ్చాయి. అర్ధరాత్రి వేళ విషమపరిస్థితుల్లో.. అంబులెన్స్‌ కోసం ప్రయత్నించారు. 2 గంటల తర్వాత అంబులెన్స్ వచ్చింది. కొవిడ్ బాధితుడు కావడంతో.. అందులోకి ఎక్కించేందుకు ఎవరూ సహకరించలేదు. ఇంట్లోని వారంతా ఆడవాళ్లే ఉండటంతో అంబులెన్స్ సిబ్బందిని ప్రాధేయపడ్డారు. ఓ ఆటో డ్రైవర్ సహాయంతో కృష్ణను అంబులెన్స్‌లోకి ఎక్కించారు. విషయం తెలుసుకొని అప్పుడే గాజులరామారం నుంచి వచ్చినకృష్ణ మేనకోడలు శిరీష అంబులెన్స్‌లో వెంటవెళ్లింది. ఈసీఐఎల్​లో ఓప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా చేర్చుకోలేదు. మరో ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో కృష్ణ... అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచాడు.

వీడియో కాల్​లో కడసారి చూపు..

కృష్ణ మరణించాడనే విషయాన్ని మేనకోడలు శిరీష కుటుంబసభ్యులకు వివరించింది. కొవిడ్‌తో చనిపోవడంతో ఇంటికి తీసుకురావద్దని సూచించారు. అంబులెన్స్ సిబ్బందికి నచ్చచెప్పి లాలాపేటలో అంతిమసంస్కారాలు నిర్వహించారు. ఆ దృశ్యాలను వీడియో కాల్‌లో కుటుంబసభ్యులకు చూపించారు. వాటినిచూసిన కృష్ణ భార్య పిల్లలు, తల్లి వసంత తట్టుకోలేకపోయారు. అప్పటికే ఆ ఇంట్లో కృష్ణ అన్నయ్య సంవత్సరం క్రితం అనారోగ్యంతో చనిపోగా.. ఏడాది తిరగకుండానే కృష్ణ చనిపోవడంతో మగదిక్కు లేకుండాపోయింది. ఏం చేయాలో పాలుపోలేదు. కృష్ణ తల్లి వసంత..... అద్దె ఇంట్లో ఉంటున్న పిల్లలను, ఉషశ్రీని తీసుకొని తన ఇంటికి వచ్చింది..

సకాలంలో అంబులెన్స్ వచ్చి ఉంటే..

ప్రాణం కోసం తపించిన తండ్రి... మరణించడాన్న విషయం తెలుసుకొని చిన్నారులు గుండెలవిసేలా రోధించారు. ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లే నాన్న... కరోనా కారణంగా దూరమవడంతో నిత్యం వేదన అనుభవిస్తున్నారు. చక్కగా చదువుకొని డాక్టర్, పోలీసు కావాలని కలలు కన్న తండ్రి.. ఇప్పుడు లేడని కన్నీరుమున్నీరవుతున్నారు. సకాలంలో అంబులెన్స్ వచ్చి ఉంటే తమ నాన్న బతికేవాడని వాపోతున్నారు.

ప్రాణవాయువు లేని అంబులెన్స్‌లు

బతికేందుకు కృష్ణ పడిన తపన... తండ్రిని బతికించుకునేందుకు భార్య పిల్లలు చేసిన ప్రయత్నాలు.... అంబులెన్స్ నిర్లక్ష్యం ముందు ఓడిపోయాయి. ప్రాణవాయువు లేని అంబులెన్స్‌లు ఎంత వేగంగా వచ్చినా ప్రయోజనం శూన్యమేనంటోన్న ఈ కుటుంబం... తమలా మరే కుటుంబంలో ఇలాంటి విషాదకర సంఘటనలు జరగకూడదని ప్రార్థిస్తోంది.

ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో 3,821 కరోనా కేసులు, 23 మరణాలు

ABOUT THE AUTHOR

...view details