ఈ జీవితంలో ఎన్నో విజయాలు సాధించాను. కానీ ‘పద్మభూషణ్’ అందుకున్న క్షణాలు మాత్రం మరచిపోలేను. అయిదో తరగతి కూడా పూర్తి చేయని నేను, అంత మంది పెద్దల సమక్షంలో అవార్డు తీసుకోవడం అంటే మాటలా! దీనంతటికీ కారణం నా కృషి మాత్రమే కాదు... దేవుని కృప, మా వినియోగదారుల ఆశీస్సులు కూడా!
నేటి పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో 1923లో పుట్టాను. నాన్న చున్నీలాల్ గులాటీ మసాలా దినుసులూ, పొడులూ అమ్మేవారు. నాకు ఇద్దరు అన్నదమ్ములు, అయిదుగురు అక్కచెల్లెళ్లు. నాన్న ఆర్యసమాజ్ సిద్ధాంతాలను పాటించేవారు. మమ్మల్ని బాగా చదివించాలని ఆశపడేవారు. కానీ ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచీ అస్సలు చదువు అబ్బలేదు నాకు. బడికి వెళ్లడమంటేనే విసుగ్గా అనిపించేది. అయిదో తరగతి నుంచీ మొత్తంగా ఎగనామమే! కనీసం పనైనా నేర్చుకుంటానని నాన్న మా కొట్టు ఉండే బజారులోనే ఓ చోట పనికి కుదిర్చారు.
నాలుగు రోజులు చేయడం, మానేయడం... ఇలాగే ఉండేది నా వ్యవహారం. కొన్నిరోజులు బియ్యంకొట్లో, మరికొన్ని రోజులు సబ్బులు అమ్మే చోట, కొన్నాళ్లు చెక్కపని చేసే చోట, చివరిగా దుస్తుల దుకాణంలో... ఇలా ఆ బజారులో నేను పనిచేయని కొట్టు లేదంటే నమ్మండి! కానీ ఎక్కడా నెల రోజులు కూడా కుదురుకోలేదు. వాటి యజమానులేమో ‘మా దగ్గర ఎందుకు బాబూ, మీవాణ్ని నీ కొట్టులోనే పెట్టుకోవచ్చు కదా’ అని నాన్నను విసుక్కునేవారు. కానీ అప్పటికి చిన్నవాణ్ని కావడంతో ఆ మసాలా ఘాటుకు నా ఆరోగ్యం పాడవుతుందని మా కొట్టులో ఉంచేందుకు నాన్న ఇష్టపడేవారు కాదు. పెళ్లి చేస్తే దారిలో పడతానని 18 ఏళ్లు రాగానే లీలావతితో వివాహం జరిపించారు. అప్పటికి మా దుకాణం బాగానే నడిచేది. నేనూ అమ్మకాలు నేర్చుకున్నా. అంతా బాగుందనుకున్న సమయంలో అనుకోకుండా కుటుంబమంతా రోడ్డున పడ్డాం.
‘‘పొద్దున లేవగానే యోగా, వాకింగ్ చేస్తా. వాట్సప్ చూస్తా. సంస్థలో అన్ని ముఖ్య సమావేశాలకూ హాజరవుతా. దిల్లీ మా ప్రధాన కేంద్రం. అప్పుడప్పుడూ ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపారం ఎలా ఉందో చూసి వస్తుంటా. ఓ వాణిజ్య ప్రకటనలో నటించాక ఇక నన్ను ఏదోలా వాటిల్లో చూపించేస్తున్నారు. నాకూ సరదాగా ఉండటంతో నటిస్తున్నా. వాటిల్లో నేను పెట్టుకునే ఎర్రని తలపాగా బాగా ఫేమస్ అయిపోయింది. అందుకే మసాలా పొడి ప్యాకెట్ మీదా నా బొమ్మే వేస్తున్నారు. దీంతో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిపోయా. నా రోల్స్‌రాయిస్ కారంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడూ అందులో చక్కర్లు కొడుతుంటా!’’
శరణార్థులయ్యాం
అప్పుడే భారత్‌కు స్వతంత్రం వచ్చింది, మా సంతోషానికి అవధుల్లేవు! కానీ అంతలోనే పిడుగులాంటి వార్త. ఇండియా నుంచి పాకిస్థాన్ వేరుపడుతోంది, మేం ఉన్నచోటు ఇక భారతదేశం కాదు! అలాంటి సమయంలో అక్కడ ఉండాలనిపించలేదు. ఉన్నవన్నీ తెగనమ్ముకుని భారత్‌కు బయల్దేరాం. అమృత్‌సర్‌లోని శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నాం. అక్కడ కొన్నాళ్లు ఉన్నాం. తర్వాత పని వెతుక్కుంటూ దిల్లీకి చేరాం. రావడమైతే వచ్చాం కానీ ఏం చేయాలో తెలీదు. నాకూ సంతానం కలగడంతో, మంది ఎక్కువై కుటుంబం నడవడం కష్టంగా మారింది. చేసేది లేక టాంగా నడపాలని నిర్ణయించుకున్నా.
నాన్నతో అంటే, తను దాచిన సొమ్ములోంచి 600 రూపాయలు ఇచ్చారు. వాటితో బండీ, గుర్రం కొని తిప్పేవాణ్ని. దిల్లీ రైల్వేస్టేషన్ నుంచి కుతుబ్ రోడ్డుకు రెండు అణాలు తీసుకునేవాణ్ని. కొందరు బాగానే ఇచ్చినా, మరికొందరు మాత్రం తెగ బేరమాడేవారు. అలవాటు లేని పని కావడంతో ఒళ్లు హూనమైపోయేది. అయినా తప్పేది కాదు. అంత కష్టపడినా రోజు గడిచాక ఎంత మిగిలిందో చూసుకుంటే బాధ కలిగేది. ఇంట్లో అందరూ కడుపు నిండా తినడానికీ ఆ డబ్బు సరిపోయేది కాదు. ఇలా అయితే కష్టమని బాగా ఆలోచించా. నాన్నకు అలవాటైన ఆ మసాలా వ్యాపారాన్ని మళ్లీ ఎందుకు మొదలుపెట్టకూడదు అనిపించింది. ఆ ఆలోచనే నా జీవితాన్ని మార్చేసింది!