పురపాలక ఎన్నికలలో ఆఖరి ఘట్టం నేటితో పూర్తికానుంది. 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థలకు మేయర్లు, ఛైర్‌పర్సన్‌లను ఇవాళ ఎన్నుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌కు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ఎన్నిక నోటీసు కూడా జారీ చేశారు. ఇందుకోసం పాలకమండళ్లు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.
పురపాలక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే మధ్యాహ్నం 12.30కు మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. పోటీలో ఒకరే ఉంటే ఎన్నిక ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఆయా పురపాలికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేతులెత్తే విధానంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరికీ సమానమైన ఓట్లు వస్తే లాటరీ విధానంలో విజేతను ఎంపిక చేస్తారు. కనీసం సగం మంది సభ్యుల హాజరుతో కోరం ఉంటేనే మేయర్, ఛైర్ పర్సన్‌ల ఎన్నిక నిర్వహిస్తారు.