GHMC Budget 2022: హైదరాబాద్ నగర అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనలో ఫలప్రదమైన పురోగతి సాధిస్తోందని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్ మహానగర పాలక మండలి 2022-23కు గానూ రూ.6150 కోట్ల వార్షిక బడ్జెట్‌ను మేయర్ ప్రవేశపెట్టారు. జీహెచ్‌ఎంసీని సరికొత్త హంగులతో విశ్వనగరంగా మార్చుకునే దిశలో 20222-23వార్షిక బడ్జెట్‌ను రూపొందించినట్లు మేయర్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన బడ్జెట్, సాధారణ సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో మేయర్ విజయలక్ష్మీ జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
విశ్వనగరంగా మార్చేందుకు..: జీహెచ్‌ఎంసీలో రెవెన్యూ ఆదాయం రూ.3434 కోట్లు కాగా.. వ్యయం రూ.2800 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ.634 కోట్లుగా బడ్జెట్‌లో చూపించారు. అదే విధంగా మూలధన ఆదాయం రూ. 3350 కోట్లు.. మూలధన వ్యయం కూడా రూ. 3350 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్‌లో ప్రధానంగా అభివృద్ది మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించినట్టు మేయర్ వివరించారు. హైదరాబాద్ నగర అభివృద్దికి సిటిజన్ సమస్యల పరిష్కారానికి ఉపయుక్తంగా ఉండేలా రూపొందించినట్లు తెలిపారు.
"మూలధనం వ్యయంలో రోడ్ల అభివృద్ది, స్కైవేలు, అండర్ పాస్లు , ప్లైఓవర్లు, ప్రధాన రోడ్ల మెయింటెనెన్స్ కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గతంలో వచ్చిన వరదల దృష్ట్యా నాలాల అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్నాం. వ్యుహాత్మక నాలాల అభివృద్ది పథకం ఎస్‌ఎన్డీపీలో భాగంగా చేపడుతున్న పనులకు రూ. 340 కోట్లు, ఇతర నాలా పనుల నిర్వహణ కోసం రూ.200 కోట్లు.. మొత్తంగా వరద నివారణ కోసం రూ.540 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేయనున్నాం. ప్రజా అవసరాలు తీర్చడం, మౌలిక సౌకర్యాలు కల్పించడం కోసం ఈ బడ్జెట్‌లో పెద్ద పీఠ వేశాం. ఇందుకోసం రూ.146 కోట్లు ఖర్చు చేస్తాం. నగరంలో థీమ్ పార్కుల అభివృద్ది కోనసాగుతుండగా.. గ్రీనరీ మరింతగా పెంచడమే లక్ష్యంగా ఈ వార్షిక బడ్జెట్‌లో 332.23 కోట్లతో గ్రీన్ బడ్జెట్ కేటాయించాం. ప్రతి భోజనంపై రెండు రూపాయల అదనపు భారాన్ని సైతం భరించి నగరంలో అభాగ్యుల ఆకలి తీర్చడం కోసం జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది." - గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్
అట్టుడికిన సభ..: పద్దుపై చర్చ ప్రారంభించిన తెరాస కార్పొరేటర్లు.. పలు రాజకీయ విమర్శలు చేయడంతో సభలో దుమారం చెలరేగింది. తెరాస కార్పొరేటర్ మన్నే కవితా రెడ్డి.. భాజపా సభ్యులను ఉద్దేశిస్తూ వరికి.. గోధుమలకు తేడా తెలియని పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఆమె వ్యాఖ్యలపై భాజపా కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కవిత ప్రసంగం ముగిసిన తర్వాత.. మేయర్‌కు భాజపా కార్పొరేటర్ల డివిజన్లలో ఎమ్మెల్యేల అనుమతి లేకుండా తిరిగే దమ్ము ధైర్యం లేదంటూ భాజపా సభ్యుడు వంగ మధుసూదన్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారానికి దారితీశాయి. ఒక్కసారిగా తెరాస కార్పొరేటర్లు దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేయగా.. తాగుబోతులు తెరాస పార్టీ కండువా కప్పుకుని సభకు వచ్చారంటూ మరో ఘాటు విమర్శ చేశారు. దీంతో ఆవేశంతో తెరాస కార్పొరేటర్లు పోడియం, భాజపా కార్పొరేటర్ల సీట్ల వైపు దూసుకెళ్లారు. దూషణలు, కౌంటర్లతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల సభ్యులు మేయర్ ముందే తోపులాటకు దిగారు. మార్షల్స్ వచ్చి అడ్డుకున్నా ఆగలేదు. దీంతో మేయర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభలో హుందాగా ఉండాలని.. భాజపా కార్పొరేటర్ మధుసూదన్ మాట్లాడిన తీరు బాగోలేదని... మధుసుధన్ మాట్లాడిన మాటలను రికార్డ్స్ నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.