తెలంగాణ

telangana

ETV Bharat / city

Matsya Setu App : మత్స్యసంపద పెంపునకు ఆన్​లైన్ కోర్సులు - Matsya Setu Application

కరోనా వల్ల కుదేలైన మత్స్య రంగం నెమ్మదిగా కోలుకుంటోంది. మత్స్యకారుల బలోపేతంపై దృష్టి సారించిన కేంద్రం.. పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తూ.. రైతులు, మత్స్యకారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. మత్స్య ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు వినియోగం గణనీయంగా పెంపొందించేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఏటా 7 శాతం వృద్ధి సాధిస్తున్న ఈ రంగంపై ఆధారపడిన రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం.. 'మత్స్యసేతు.. ది వర్చువల్ లెర్నింగ్' మొబైల్ యాప్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

matsya-setu-application-helps-farmers-to-improve-fisheries-production
మత్స్యసంపద పెంపునకు ఆన్​లైన్ కోర్సులు

By

Published : Jul 10, 2021, 3:13 PM IST

దేశంలో నీలి విప్లవం దిశగా అడుగులు వేస్తున్న నరేంద్రమోదీ సర్కారు... కరోనా వల్ల కుదేలైన మత్స్య రంగానికి పునర్​వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఈ రంగంలో.. ఉత్పత్తి, ఉద్పాదకత పెంపొందించేందుకు కృషి చేస్తోంది. పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తూ రైతులు, మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపుతోంది. జలాశయాలు, చెరువులు, ఇతర నీటి వనరులు, భూసారం అపారంగా ఉండటంతో ఏటా వృద్ధి సాధిస్తున్న ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

మత్స్యసేతు యాప్

2019-2020లో భారత్‌.. 14.16 మిలియన్ మెట్రిక్ టన్నుల మత్స్య ఉత్పత్తి సాధించింది. ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉండగా... భారత్‌ రెండో స్థానంలో ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా 6.3 శాతంగా నమోదైంది. కొవిడ్-19 నేపథ్యంలో ఈ కొనసాగింపు దృష్టిలో పెట్టుకుని చేపలు, రొయ్యలు, పీతల రైతుల కోసం ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభించింది. తాజాగా మంచి నీటిలో చేపలు, రొయ్యలు, ఇతర జాతుల పెంపకంపై టెక్నాలజీ అందించేందుకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఐసీఏఆర్ - సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వా కల్చర్ - సీఐఎఫ్‌ఏ సంస్థ అభివృద్ధి చేసిన "మత్స్య సేతు" అనే మొబైల్ యాప్‌ను దిల్లీలో కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఆవిష్కరించారు. ది వర్చ్యువల్ లెర్నింగ్ పేరిట "మత్స్య సేతు" మొబైల్ యాప్‌ వేదిక రూపకల్పనకు అవసరమైన ఆర్థిక సాయం, మద్ధతు హైదరాబాద్‌లోని జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ - ఎన్ఎఫ్‌డీబీ అందించింది.

మత్స్య రంగం బలోపేతానికి..

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మత్స్య రకాలు, అంశాల వారిగా స్వీయ అభ్యాస అనువర్తనం గణాంకాలు, ప్రత్యేకించి నిపుణుల వివరణలు, ప్రశ్నలు, సమాధానాలు వంటివి యాప్‌లో పొందుపరిచాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ సర్కారు పలు ముఖ్యమైన మత్స్య అభివృద్ధి పథకాలు అమల్లోకి తీసుకొచ్చింది. 2015-16 నుంచి 2019-20 వరకు నీలి విప్లవం తీసుకురావాలన్న లక్ష్యంతో బ్లూ రెవల్యూషన్ స్కీం ప్రవేశపెట్టి 3 వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. 2018-19లో ఫిషరీస్, ఆక్వా కల్చర్ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి - ఎఫ్‌ఐడీఎఫ్ కింద 7522 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేస్తోంది. 2020-21లో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద 20,050 కోట్ల రూపాయలు కేటాయించి సుస్థిర మత్స్య అభివృద్ధి, వినియోగం పెంపు, బలోపేతం, నియంత్రణ విలువ గొలుసు, బలమైన విప్లవాత్మక చట్రం నిర్మాణం ప్రోత్సాహిస్తోంది.

- డాక్టర్ బి.సువర్ణ, చీఫ్ ఎగ్జిక్యూటివ్, జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ

అందుకే ఈ యాప్..

2025 నాటికి మంచినీటి చేపల ఉత్పత్తి రెండింతలు చేయాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించింది. ఫిష్ పాండ్లలో ఉత్పాదకత పెంపు, నాణ్యమైన చేప పిల్లల విత్తనం ఉత్పత్తి, విత్తన ఆధారితర ఆక్వా కల్చర్ ప్రోత్సాహం ఇవ్వడం సహా క్రియాశీలక ఆరోగ్య నిర్వహణ కొలమానాల పెంపునకు కేంద్ర మత్స్య శాఖ ఇతోధికంగా కృషి చేస్తోంది. కొవిడ్‌ తొలి, రెండో దశల్లో.. మత్స్య రైతులు, మత్స్యకార కుటుంబాలపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపడంతో రైతులు భౌతికంగా పరిశోధన సంస్థలు, కార్యాలయాలకు వెళ్లి శిక్షణ తరగతులకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. దీనికి పరిష్కారంగా కనుగొన్నదే మత్స్య సేతు యాప్. మత్స్య రంగంలో ఆధునిక పోడకలపై ఈ యాప్‌ ద్వారా నిష్ణాతులు ఆన్​లైన్​లోనే శిక్షణ అందజేస్తారు. రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విత్తనం దగ్గర నుంచి మేత, ఔషధాలు, నీరు, నేల, ఆరోగ్యం, వేట, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌పై ఎన్‌ఎఫ్‌డీబీ నైపుణ్యం పెంచేందుకు తోడ్పడతారు.

ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి..

భారతదేశంలో మత్స్య సంపద సూర్యోదయ రంగంగా విరాజిల్లుతున్న తరుణంలో కేంద్రం ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతిష్ఠాత్మక నీలి విప్లవం పథకం కొనసాగింపుగా ఈ కార్యక్రమాల రూపకల్పన చేసిన కేంద్రం... రాష్ట్రాల వారీగా ఉత్పత్తి, గిరాకీ, వినియోగం పెంపొందించడంపై ఎన్‌ఎఫ్‌డీబీ ద్వారా పెద్దఎత్తున కృషి చేస్తుండటం విశేషం. దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి.. తెలుగు రాష్ట్రాల మత్స్య రైతులు, మత్స్యకారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.

ABOUT THE AUTHOR

...view details