రాష్ట్రంలో వాణిజ్య వాహనాల పన్నులు పెరిగాయి. క్షేత్రస్థాయి అధికారులకే కాదు వాహనదారులకూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఈ పెంపుదలను అమల్లోకి తెచ్చింది. దీంతో మూడు నెలలకోసారి చెల్లించాల్సిన పన్ను తడిసి మోపెడయింది. గడువు మేరకు పన్ను చెల్లించేందుకు ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల్లో ప్రయత్నిస్తే భారీగా పన్ను పెరిగినట్లు చూపిస్తుండటంతో వాహనదారులు కంగుతింటున్నారు. ఇటీవల వాహనాల జీవితకాల పన్ను మొత్తాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం ఇప్పుడు వాణిజ్య వాహనాల పన్నును సైతం పెంచింది.
భారీగా భారం..రాష్ట్రంలో సుమారు 5.70 లక్షల వరకు సరకు రవాణా వాహనాలు ఉన్నాయి. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు మరో 1.40 లక్షల వరకు ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలల బస్సులు 27 వేలకు పైగా ఉన్నాయి. వీటితోపాటు ప్రయాణికులను చేరవేసే బస్సులు, వివిధ అవసరాలకు వినియోగించే ట్యాంకర్లపైనా పన్ను భారం పడింది. కొన్నింటికి 20 శాతం వరకు పెరిగితే మరికొన్నింటికి అంతకుమించి పెరిగినట్లు సమాచారం. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలతో పోలిస్తే రాష్ట్రంలోని పన్నులు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పటికే డీజిల్ ధరలు పెరగడంతో కూడా వాణిజ్య వాహనాలు నడపటం భారంగా మారిందని ఆపరేటర్లు ఆవేదన చెందుతున్నారు.
* పాఠశాల విద్యార్థుల కోసం నడిపే మినీ బస్సులపై గతంలో రూ.775 ఉన్న పన్నును రూ.910కి పెంచింది.
* పెద్ద బస్సులపై పన్ను రూ.1,396 ఉండగా, రూ.1,750లకు పెంచింది.
* ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న బస్సులోని ప్రతి సీటుకు గతంలో రూ. 3,675 ఉండే మొత్తాన్ని రూ. రూ.4,000లకుపెంచింది.
* రాష్ట్రమంతా తిరిగే బస్సులోని ప్రతి సీటుకు పన్ను గతంలో రూ.2,625 ఉండగా రూ.4,000లకు పెంచింది.