బీటెక్, బీఫార్మసీ చదవబోయే విద్యార్థులకు జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు షాక్ ఇచ్చాయి. రెగ్యులర్‌తో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను ఏకంగా రెట్టింపు చేశాయి. ఫలితంగా ప్రైవేట్‌లోనే కాదు... ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఇంజినీరింగ్ చదవడం భారంగా మారనుంది. పెరిగిన ఫీజులు జేఎన్‌టీయూ హైదరాబాద్ ప్రాంగణంతో పాటు మంథని, సుల్తానాపూర్, జగిత్యాల, ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభమవుతున్న సిరిసిల్ల కళాశాలల్లో అమలవుతాయి. ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో కూడా పెంపు ఉంటుంది. కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు మాత్రం పెంచలేదు. రుసుములను పెంచుతున్నట్లు కనీసం ప్రకటన కూడా ఇవ్వకుండా వర్సిటీలు గుట్టుగా వ్యవహరించడం గమనార్హం. బీటెక్ రెగ్యులర్ ఫీజును రూ.18 వేల నుంచి రూ.35 వేలకు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రూ.35 వేల నుంచి రూ.70 వేలకు పెంచారు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం(2021-22) నుంచి ప్రారంభిస్తున్న కృత్రిమ మేధ కోర్సుకు ఏకంగా రూ.1.20 లక్షలు రుసుంగా నిర్ణయించడం గమనార్హం.
మూడేళ్లలోనే భారీగా పెంపు
వర్సిటీల్లోని రెగ్యులర్ బీటెక్ ఫీజును 2019లో రూ.10 వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. తాజాగా రూ.35 వేలు చేయడం గమనార్హం. ఇక సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సుల ఫీజులు ఏకంగా రూ.70 వేలకు చేరుకున్నాయి. ఈ కోర్సుల్లో బోధించే కాంట్రాక్టు, తాత్కాలిక అధ్యాపకుల జీతాలను నిర్దేశించడంలో భాగంగా ఫీజులను పెంచుకోవచ్చని జులైలో విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. కనీస రుసుంను రూ.45 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా వర్సిటీలు పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయిం తీసుకోవాలంది. విద్యాశాఖ కనీస ఫీజు బీటెక్‌కు రూ.45 వేలుగా నిర్ణయించగా...వాటిని జేఎన్‌టీయూహెచ్ ఏకంగా రూ.70 వేలకు పెంచడం గమనార్హం.
ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా ఆయా కళాశాలల జాబితా, కోర్సులు, ఫీజులు తదితర వివరాలను సాంకేతిక విద్యాశాఖ పొందుపరిచింది. దాంతో ఫీజుల పెంపు విషయం వెలుగులోకి వచ్చింది.
బాబోయ్...ఓయూ ఫీజు