తెలంగాణలో ఏ క్షణంలో అయినా భారీ కుంభకోణాలు వెలుగులోకి రావచ్చని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ (BJP MP Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో వేములవాడలో ఉప ఎన్నిక రావచ్చని జోస్యం చెప్పారు. రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వేములవాడ ఉప ఎన్నికలో విజయ దుందుభి మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలో మీడియా సమావేశంలో అర్వింద్ మాట్లాడారు. తెలంగాణలో రైతు పరిస్థితి ఆగం అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్ ఫెడ్ సంస్థను కేసీఆర్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. మొక్కజొన్న పంటను మార్క్ ఫెడ్ సంస్థ కాకుండా దళారీలు కొనుగోలు చేసే పరిస్థితులను కల్పించారని మండిపడ్డారు. తెలంగాణలో 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతోందని వివరించారు. కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారని ఆరోపించారు.
మిల్లర్లు రూ.370 సంపాదిస్తున్నారు
'సిండికేట్ల వల్ల రైతులు తక్కువ ధరకు మొక్కజొన్న పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఎఫ్‌సీఐ కొనుగోలు చేయడం వల్ల తెలంగాణలో కేవలం వరి పంట సాగు చేయాలని కేసీఆర్ కోరారు. ఎటువంటి కష్టం లేకుండా రైస్ మిల్లర్లు క్వింటాలు వడ్లకు రూ.370 సంపాదిస్తున్నారు. ఎఫ్‌సీఐ ఇచ్చే డబ్బులతో కేసీఆర్ బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థను నడుపుతున్నారు. రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యానికి కేంద్రం ఎఫ్‌సీఐ నుంచి సకాలంలో డబ్బులు చెల్లిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, రైతుల నుంచి వరి ధాన్యం సేకరించిన దానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు.'
- అర్వింద్, భాజపా ఎంపీ
రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది
రైతుల అయోమయ పరిస్థతికి సీఎం కేసీఆర్ కారణమని ఎంపీ అర్వింద్ (BJP MP Arvind) ఆరోపించారు. ఎటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లోకి రైతులను నెట్టి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి వరిధాన్యం సేకరణ సకాలంలో జరగడం లేదని విమర్శించారు. డబ్బులు చెల్లింపులు ఆలస్యం అవుతోందని ప్రశ్నిస్తే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. ప్రజలు, రైతులు తిరగబడే రోజు తెలంగాణలో దగ్గరలోనే ఉందన్నారు.