ఎడాపెడా కరెంట్ కోత.. ఓవైపు ఉక్కపోత.. మరోవైపు దోమలమోత
Massive Power Cuts in AP : విద్యుత్ కోతలతో ఏపీలోని గ్రామాలు గాఢాంధకారంలోకి వెళ్లిపోతున్నాయి. రాత్రివేళ గంటల తరబడి కరెంటు కట్ చేయడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసంగా 4 నుంచి 5 గంటల పాటు విద్యుత్ ఉండని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంట్లో ఉక్కపోత, బయట దోమలమోత వెరసి.. కాళరాత్రుల్లో జాగారం చేస్తున్నామంటున్నారు. మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోనూ అనధికార కరెంట్ కోతలు తీవ్రస్థాయికి చేరిపోయాయి. లోడ్ రిలీఫ్ పేరిట గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం 40 మిలియన్ యూనిట్ల వరకూ లోటు ఉన్నట్టు విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి.
Massive Power Cuts in AP
By
Published : Apr 7, 2022, 7:21 AM IST
ఎడాపెడా కరెంట్ కోత.. ఓవైపు ఉక్కపోత.. మరోవైపు దోమలమోత
Current Cut in Andhra Pradesh: ఏపీలో విద్యుత్ కోతలతో గ్రామాలు గాఢాంధకారంలోకి జారిపోతున్నాయి. రాత్రివేళ గంటల తరబడి కరెంటు తీసేయడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇంట్లో ఉక్కపోత, బయట దోమలమోత వెరసి కాళరాత్రుల్లో జాగారం చేస్తున్నామని వాపోతున్నారు. పసిపిల్లల తల్లులు రాత్రంతా విసనకర్రతో గాలి విసురుతూ కూర్చోవాల్సి వస్తోంది. పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంత నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లు అందుబాటులో లేక రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
Power Cut in AP : కుటీర పరిశ్రమలపై పెను ప్రభావం పడుతోంది. 2015 నుంచి విద్యుత్ కోతలు లేకపోవటంతో పూర్తి వెలుగుల మధ్య గడుపుతున్న ప్రజలకు.. ఏడేళ్ల తర్వాత ఈ అనుభవం ఎదురవుతోంది. రాత్రివేళ పల్లెల్లో వీధులు నిశీధులుగా మారటం ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని గ్రామాల్లో దశలవారీగా రోజుకు 14 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఫిర్యాదు కేంద్రాలకు ఫోన్ చేస్తున్నవారు పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందని అడగటం మానేసి, కనీసం కోతలు విధించే షెడ్యూల్ ప్రకటించాలని వేడుకుంటున్నారు.
ప్రణాళికా లోపమే కారణం:వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సమకూర్చుకోవడంపై డిస్కంలు దృష్టి పెట్టలేదు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో సుమారు 20 శాతం బహిరంగ మార్కెట్ నుంచి కొంటున్నారు. వేసవిలో డిమాండ్ 240-250 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మధ్య ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏల ప్రకారం సుమారు 190 ఎంయూల విద్యుత్ వస్తుంది. కనీసం 50 ఎంయూల మేర అదనంగా అవసరమని ముందే తెలుసు. ఎక్ఛేంజీల నుంచి రోజూ ఇంత కొనడం కష్టం. వేసవి అవసరాల దృష్ట్యా అదనపు విద్యుత్‌కు స్వల్పకాలిక పీపీఏలు కుదుర్చుకొని ఉండాల్సిందని ఓ అధికారి పేర్కొన్నారు. జెన్‌కో థర్మల్ కేంద్రాల దగ్గర బొగ్గు నిల్వలు సరిపడా అందుబాటులో ఉంచలేదు. కృష్ణపట్నం కేంద్రానికి విదేశీ బొగ్గును తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికే ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 800 మెగావాట్ల సామర్థ్యమున్న మూడో యూనిట్‌తో పీపీఏ కుదుర్చుకోవడానికి డిస్కంలు ఆసక్తి చూపలేదు. ఈ కారణాలన్నీ కోతలకు దారితీసినట్లు ఆ అధికారి విశ్లేషించారు.
జెన్‌కోతో పాటు హిందుజా నుంచి వచ్చే థర్మల్ విద్యుత్‌తో కలిపి 90.79 ఎంయూలు అందుబాటులో ఉంది. జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 9.5 ఎంయూలు, పవన, సౌర విద్యుత్ కలిపి 26 ఎంయూలు, కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ నుంచి సుమారు 40 ఎంయూల వచ్చినా రాష్ట్ర డిమాండ్ మేరకు ఇంకా 50 ఎంయూలు డిస్కంలు కొనాలి. ఇందుకు రోజూ కనీసం రూ.35 కోట్లు అవసరం. విద్యుత్ ఎక్ఛేంజీల్లో డిమాండ్ పెరడగడంతో కొన్ని టైం బ్లాక్ (ఒక్కో బ్లాక్ 15 నిమిషాలు)లలో యూనిట్ రూ.15-20 చొప్పున కొనాల్సి వస్తోంది. ఏపీ డిస్కంలు దాఖలు చేసిన బిడ్‌కు ఇక్కడ విద్యుత్ దొరకటం లేదు. దీంతోపాటు అన్‌షెడ్యూల్ ఇంటర్‌ఛేంజ్ (యూఐ) కింద జాతీయ గ్రిడ్ నుంచి రోజూ 3-4 ఎంయూల విద్యుత్‌ను అదనంగా డిస్కంలు తీసుకున్నా 15-20 ఎంయూల లోటు నమోదవుతోంది.
డిస్కంలులోటు విద్యుత్‌గా చూపుతున్న మొత్తాన్ని సర్దుబాటు చేయటానికి అత్యవసర లోడ్ రిలీఫ్ పేరిట గ్రామాల్లో అడ్డగోలుగా కోతలు విధిస్తున్నాయి. రాష్ట్ర డిమాండ్ 235 ఎంయూలలో అధికారికంగా డిస్కంలు చూపుతున్న ఈఎల్‌ఆర్ 5-10% మాత్రమే. అయినా రోజుకు 10-14 గంటలపాటు కరెంటు తీసేస్తున్నారు. డిస్కంలు చూపుతున్న లోటు ప్రకారమైతే రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రోజుకు ఇన్నేసి గంటలపాటు కోత పెట్టాల్సిన అవసరం రాదని, వాస్తవ విద్యుత్ లోటును డిస్కంలు బయట పెట్టడం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో?
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఒంటి గంట నుంచి 45 నిమిషాల పాటు కరెంటు లేదు. బుధవారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మళ్లీ కోత విధించారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి వేకువజాము 3 గంటల వరకు సరఫరా నిలిచింది. బుధవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి వరకూ రాలేదు. మద్దిపాడులో మంగళవారం రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు, మళ్లీ బుధవారం ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కోత విధించారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవలో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి గంటన్నర పాటు, మళ్లీ బుధవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30వరకు విద్యుత్ సరఫరా లేదు.
కడప జిల్లా ముద్దనూరు మండలంలో రోజులో 6-8 గంటలు కోతలను ప్రజలు భరించాల్సి వస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో మంగళవారం అర్ధరాత్రి 12.40 నుంచి వేకువజాము 5.10 వరకు చీకట్లు అలముకున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 వరకు విద్యుత్ లేదు. తిరువూరు పట్టణంలో రోజంతా 6 సార్లు కోతలు విధించారు.
విజయనగరం జిల్లా రామభద్రాపురంలో మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి వేకువజాము 5 వరకూ సరఫరా నిలిచింది. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 దాకా కరెంటు లేదు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత 12.30 నుంచి వేకువజామున 3 గంటల వరకు కరెంటు లేదు. బుధవారం తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 6.30 వరకు, ఉదయం 9.20 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 3 నుంచి 4.30 వరకు, సాయంత్రం 6.30 నుంచి 7 వరకు పలు దఫాలుగా కోతలు విధించారు.
సౌర విద్యుత్ మొత్తం సామర్థ్యంలో 20 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలో మంగళవారం విద్యుదుత్పత్తి సామర్థ్యం, వాస్తవ ఉత్పత్తి (మెగా వాట్లలో)