రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఎంటెక్ ప్రథమ సంవత్సర పరీక్షలతోపాటు బ్యాక్‌లాగ్ పరీక్షలు రెండు రోజుల క్రితం ముగిశాయి. కరోనా కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడరాదని ఏ కళాశాల విద్యార్థులు అదే కళాశాలలో పరీక్షలు రాసుకునేలా సెల్ఫ్ సెంటర్ సౌకర్యం కల్పించారు. ఇదే అదనుగా భావించిన కొన్ని కళాశాలల సిబ్బంది అక్రమాలకు తెరలేపారు. విద్యార్థుల నుంచి ఒక్కో సబ్జెక్టుకు ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేసి పుస్తకాలు పెట్టుకొని చూసి రాసుకునే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది.
గతంలో ఫెయిలయి తిరిగి ఇప్పుడు ఆ పరీక్షలు(బ్యాక్‌లాగ్‌లు) రాసే విద్యార్థుల నుంచి ఇంకా ఎక్కువ వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్-వరంగల్ రహదారిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు రాసిన విద్యార్థులు జవాబుపత్రాలను మొబైల్‌లో ఫొటోలు కూడా తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ కళాశాలపై గతంలోనూ పలు రకాల ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా 10-20 ఇంజినీరింగ్ కళాశాలల్లో కాపీయింగ్ జరిగినట్లు అంచనా. మూల్యాంకనం సందర్భంగా కాపీయింగ్‌పై తేలుస్తామని అధికారులు చెబుతుండగా... బోర్డుపై రాసి దానిని అందరూ రాసుకుంటేనే జవాబులు ఒకేరకంగా ఉంటాయని, పుస్తకాలు పెట్టుకొని రాసుకుంటే ఒకేలా ఉండవని నిపుణులు చెబుతున్నారు. గత పరీక్షల్లో ఉత్తీర్ణత, ఈసారి ఉత్తీర్ణత చూస్తే స్పష్టంగా తేడా కనిపిస్తుందని వారు విశ్లేషిస్తున్నారు.