ఏప్రిల్, మే మాసాల్లో లగ్గాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే ఈ మాసాన్ని పెళ్లిళ్ల సీజన్ అంటారు. కానీ.. కరోనా దెబ్బకి చాలా మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో ఈ సీజన్‌లో సుమారు 20వేల వరకు వివాహాలు జరగాల్సి ఉండగా... అందులో చాలా వరకు వాయిదా వేసుకున్నారని పురోహితులు స్పష్టం చేస్తున్నారు.
అందరి ఆశలు పెళ్లిపైనే..
శ్రీరామనవమి పూర్తవ్వగానే పెళ్లిళ్లకు మంచి రోజులు ఉంటాయ్. ఈ సీజన్ కోసం పురోహితులు, టెంట్ హౌజ్ వాళ్లు, క్యాటరింగ్ వాళ్లు, ఫోటో వీడియో గ్రాఫర్‌లు, ఫంక్షన్ హాళ్ల యజమానులు, బట్టల వ్యాపారులు, బంగారు వ్యాపారులు ఎదురు చూస్తుంటారు. వీరి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. టెంట్ హౌజ్‌నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారిని కరోనా కొలుకోలేని దెబ్బ కొట్టింది. అసలే ఫంక్షన్ హాళ్లు రాకతో ఇప్పటికే బిజినెస్ సగానికి పడిపోయింది. ఇప్పుడు కరోనాతో మరింత నష్టపోవాల్సి వచ్చిందని టెంట్ హౌజ్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో పురోహితులు 20 నుంచి 25 పెళ్లిళ్లు..
కరోనా ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పురోహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పురోహితుడు ఈ మాసంలో దాదాపుగా 20 నుంచి 25 పెళ్లిళ్లు మాట్లాడుకుంటారు. ఇప్పుడు జరగాల్సిన వాటిలో సగానికి పైగా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. గ్రేటర్ పరిధిలో ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు వెలవెలపోతున్నాయి. కేటరింగ్ సర్వీసుల్లో, బ్యాండ్ మేళాల్లో పని చేసే వాళ్లు ఉపాధిని కోల్పోయామంటున్నారు.