Margadarsi MD Sailaja Kiran : ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ కంపెనీల్లో కేవలం 4 శాతానికి మాత్రమే స్త్రీలు సీఈవోలుగా ఉన్నారని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్ అన్నారు. చాలా మందికి కుటుంబం నుంచి ప్రోత్సాహం లభించడం లేదన్నారు. 10 శాతం కంటే తక్కువ దేశాల్లో మహిళలు దేశాధినేతలుగా ఉన్నారని పేర్కొన్నారు. తానా సంస్థ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత శక్తి’ అనే అంశంపై ఆదివారం రాత్రి జరిగిన వెబినార్‌లో ఆమె ముఖ్య వక్తగా పాల్గొన్నారు.
Margadarsi MD Sailaja Kiran About Women : మహిళలకు సహజంగానే బహుముఖ సామర్థ్యం ఉంటుందని, దానివల్ల వ్యాపార, వాణిజ్య రంగాల్లో తప్పక రాణిస్తారని తెలిపారు. నిర్వహణ సామర్థ్యం, సంక్షోభ సమయాలను దీటుగా ఎదుర్కొనే శక్తి వారి సొంతమన్నారు. స్వతంత్ర భావాలు కలిగేందుకు, విచక్షణ జ్ఞానాన్ని పెంచేందుకు విద్య తోడ్పడుతుందని పేర్కొన్నారు. చేపట్టబోయే వాణిజ్య, వ్యాపారాలకు సంబంధించిన సృజన నైపుణ్యాలనూ అభ్యసించాలని సూచించారు. పిల్లలకు విద్యను అందించడం, వారికోసం సంపద సృష్టించడమే కాకుండా జీవననైపుణ్యాలను పెంపొందించాలని, సవాళ్లను ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దాలని తల్లిదండ్రులను కోరారు.
Sailaja Kiran on Women Empowerment : మహిళలు.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడమే విజయానికి తొలి మెట్టు అని శైలజాకిరణ్ తెలిపారు. 1995లో మార్గదర్శి రూ.350 కోట్ల టర్నోవర్ సాధించగా.. మరో 15-20 ఏళ్లలో రూ.10 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలని లక్ష్యం పెట్టుకొని క్రమంగా దాన్ని సాధించామని తెలిపారు. మార్గదర్శి సంస్థ అభివృద్ధిలో భాగంగా.. వేల మంది సిబ్బందితో లక్షల మంది వినియోగదారులతో సాగించిన వ్యాపార అనుభవాలను వివరించారు. మార్గదర్శి వంటి సంస్థలను నిర్వహించడంలో ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అత్యంత ముఖ్యమని చెప్పారు. రామోజీ ఫౌండేషన్ రంగారెడ్డి జిల్లాలోని నాగన్‌పల్లి, కృష్ణా జిల్లాలో పెద్దపారుపూడిలను దత్తత తీసుకొని, వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. స్థానిక యువతకు మంచి విద్య అందించడం సహా వారిలో నైపుణ్యాలు పెంపొందిస్తున్నట్లు వివరించారు.
TAANA Webinar on Women Empowerment : తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ సంస్థ చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. మహిళా సాధికారతను తానా ఒక ముఖ్య అంశంగా తమ ఎజెండాలో చేర్చి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పూర్వ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి మాట్లాడుతూ.. మన పురాణాల్లో స్త్రీకి ఉన్న ప్రాధాన్యం, శక్తి సామర్థ్యాలను వివరించారు. స్త్రీ ఔన్నత్యాన్ని చాటే తెలుగు పద్యాలనూ వినిపించి అందర్నీ మెప్పించారు. మహిళలు వివిధ రంగాల్లో ముందడుగు వేస్తున్నారని, అలాంటివారికి ఈ కార్యక్రమం మరింత ప్రేరణగా నిలుస్తుందని తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో మహిళలు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారని గార్గీ, మైత్రేయిల గురించి తానా కల్చరల్ కో ఆర్డినేటర్ తూనుగుంట్ల శిరీష వివరించారు. తానా పూర్వ మహిళా అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల, ఏలూరి మాధురి, తానా కార్యవర్గం, సభ్యులు హాజరయ్యారు.