మావోయిస్టు నేత బజ్జర సమ్మక్క.. అలియాస్ శారదక్క డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. శారదక్క కరోనాతో మృతిచెందిన మావోయిస్టు నేత హరిభూషణ్ భార్య. గతంలో చర్ల- శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం కాగా.. 1994లో పీపుల్స్‌వార్ పార్టీకి ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో కమాండర్‌గా పనిచేస్తున్న హరిభూషన్ దళంలోకి తీసుకెళ్లాడు. 1995లో హరిభూషన్, శారదక్కను పెళ్లి చేసుకున్నారు. ప్లటూన్ కమాండర్‌గా, సెంట్రల్ కమిటీ కమాండర్‌గానూ ఆమె పని చేశారు. 2006లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్ తగిలి కన్ను కోల్పోయారు. 2007లో ఎస్పీ ఎదుట లొంగిపోయారు. 2011లో మరోసారి హరిభూషన్ ఒత్తిడితో మావోయిస్ట్ పార్టీలో చేరారు. హరిభూషన్ రెండు నెలల క్రితం కరోనాతో మృతి చెందగా.. మావోయిస్ట్ సిద్ధాంతాల పట్ల శారద అనాసక్తిగా ఉన్నారని.. డీజీపీ తెలిపారు.
కొత్తగా ఎవరూ చేరట్లేదు..
"ఆరు నెలల్లో 20 మంది మావోయిస్టులు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పోలీస్‌ల ద్వారా శారద విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణా మావోయిస్ట్ రాష్ట్ర కమిటీలో 115 మంది ఉన్నారు. వాళ్లలో కేవలం 15 మందే రాష్ట్రానికి చెందినవాళ్లు. మిగతా వాళ్లు గుత్తికోయలు. కేంద్ర కమిటీలో 25 మంది ఉన్నారు. వారిలో 11 మంది తెలంగాణ, ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. మిగతా 11 మంది ఇతర రాష్ట్రాల వాళ్లు. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు తెలుగు వాడే. తెలంగాణ నుంచి మావోయిస్ట్ పార్టీలో కొత్తగా ఎవరూ చేరడం లేదు."-మహేందర్‌రెడ్డి, డీజీపీ
కేంద్ర కమిటీ సభ్యులైన అజాద్, రాజిరెడ్డి లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నారని డీజీపీ తెలిపారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు వాళ్లను అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం దామోదర్ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారన్న డీజీపీ... శారద లొంగిపోయినందుకు 5 లక్షల రివార్డ్ అందజేస్తున్నామని తెలిపారు.
'హింస ద్వారా సాధించేదేమీ లేదు.. జనజీవన స్రవంతిలోకి వచ్చేయండి' ఇదీ చూడండి: