Maoist commander Rajitha arrest: గత రెండు రోజుల నుంచి తెలంగాణ, చత్తీస్ఘడ్ రాష్ట్రాల పోలీసులు భారీ బందోబస్తులో భద్రాది కొత్తగూడెం ప్రాంతం అడవులను పూర్తిగా జల్లెడ పడుతున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల అదుపులో మావోయిస్టు మహిళా నేత రజిత ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈమె మావోయిస్టు పార్టీ అగ్ర నేత దామోదర్ భార్య. మనకన పల్లి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. ఈ మేరకు మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లేఖను విడుదల చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా డోకుపాడు, కూర్ణపల్లి, కోనవాయి గ్రామాలపై దాడి చేశారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న చర్ల మావోయిస్టు కమాండర్ రజితను, మరో నలుగురు దళ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వీరిని వెంటనే పోలీసుల అదుపులో నుంచి దగ్గరలో ఉన్న కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు.