తెలంగాణ

telangana

ETV Bharat / city

Maoist Bundh: జులై 1న ఏవోబీ జోన్​లో మావోయిస్ట్ బంద్!

ఈనెల 16న ఏపీలోని ఏవోబీలోని తీగలమెట్టలో జరిగిన దాడిని ఖండిస్తూ జులై 1న జోన్ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ బంద్​కు పిలుపునిచ్చింది. ఆ ఘటనలో ఆరుగురు అమరులయ్యారని ఏవోబీ ఎస్‌జెడ్​సీ కార్య‌ద‌ర్శి గ‌ణేశ్ తెలిపారు. బంద్​ను విజయవంతం చేయాలని కోరారు.

జులై 1న ఏవోబీ జోన్​లో మావోయిస్ట్ బంద్!
జులై 1న ఏవోబీ జోన్​లో మావోయిస్ట్ బంద్!

By

Published : Jun 26, 2021, 7:50 PM IST

జులై 1న ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీ ప‌రిధి ఆధ్వ‌ర్యంలో బంద్ నిర్వహిస్తున్నట్లు ఏవోబీ ఎస్‌జెడ్​సీ కార్య‌ద‌ర్శి గ‌ణేశ్​ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈనెల 16న ఉదయం 9.30 గంటలకు తీగలమెట్ట గ్రామానికి దూరంగా అడవిలో మావోయిస్టులు మకాం వేసి ఉన్న ప్రాంతాన్ని ద్రోహులు ఇచ్చిన స‌మాచారంతో పోలీసు బలగాలు చుట్టుముట్టి దాడి చేశార‌ని గ‌ణేశ్​ ఆరోపించారు. ఈ దాడిలో ఎంకేవీబీ డివిజ‌న్ క‌మిటీ స‌భ్యుడు ర‌ణ‌దేవ్‌, మ‌రొక డివిజ‌న్ క‌మిటీ స‌భ్యుడు అశోక్ అలియాస్ గంగ‌య్య‌, ఏరియా క‌మిటీ స‌భ్యురాలు క‌డితి పాయికే, మ‌డ‌కం అంజ‌న్న‌, మ‌డ‌కం పాయికే, ల‌లితలు అమ‌రుల‌య్యార‌ని తెలిపారు.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఒక వైపు కరోనా సమస్యలతో ప్రజల జనజీవనం అల్లకల్లోలంలో ఉన్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ప్రజల కోసం వైద్యం, ఆహారం అందించడం వంటి కార్యక్రమాలను ప్రధానంగా చేస్తున్నామని.. ఎలాంటి ప్రతిఘటన చర్యలను చేపట్టలేదని గ‌ణేశ్​ తెలిపారు. ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వం కనీసం వైద్యం అందించడం కాదు కదా.. కరోనా టెస్టింగ్ కూడా చేయలేదని, ఇంతవరకూ మన్యంలో ఏ ఒక్క డాక్టరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుతో వందలాది పోలీసు బలగాలను ఆదివాసీ ప్రాంతంలోకి ప్ర‌భుత్వం పంపిస్తుందని మండిపడ్డారు.

పాశ‌విక నిర్బంధ కాండలో భాగంగానే ఇన్​ఫార్మర్ ద్వారా సమాచారం తెలుసుకుని గ్రామాలపై, ఇళ్లపై దాడులు చేశారని.. అందుకు ఈ దాడే కారణమని అన్నారు. మావోయిస్టు ఉద్యమ నిర్మూలనలో భాగంగానే తీగలమెట్ట వ‌ద్ద అకస్మాత్తుగా దాడి చేశార‌ని.. దీనిని ఖండించాలని కోరారు. తీగ‌లమెట్ట‌లో జ‌రిగిన దాడిని ఖండిస్తూ జులై 1న ఏవోబీ జోనల్​ వ్యాప్తంగా తలపెట్టనున్న బంద్​ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి.Delta Plus: తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు

ABOUT THE AUTHOR

...view details