ఒకే సిలబస్, ఒకే శిక్షణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడేలా ప్రతిపాదించిన ‘ఉమ్మడి సిలబస్’ రాష్ట్రంలో ఆమోదం పొందలేదు. యూపీఎస్సీ ఆమోదించినా, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రామకృష్ణయ్య కమిటీ నివేదిక ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా ప్రభుత్వ అనుమతి లభించలేదు. దీంతో రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు కష్టాలు ఎదురవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలకు వేర్వేరు శిక్షణ, సిలబస్ పుస్తకాల ఖర్చు, హాస్టళ్ల అద్దెలు, ఇతర ఖర్చులు భరించలేక ఆందోళన చెందుతున్నారు. నివేదిక ఆమోదం పొందకపోవడంతో ఉమ్మడి సిలబస్, గ్రూప్-1, 2 ఉద్యోగాలను కలుపుతూ తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు, ఏటా ఉద్యోగ కేలండర్ ఆలోచనలు నిలిచిపోయాయి.
కమిటీ ఏం చెప్పింది...
ఉమ్మడి సిలబస్‌ను యూపీఎస్సీ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్ర నియామకాల్లో అమలు చేయాల్సిన సంస్కరణలపై ప్రభుత్వం రామకృష్ణయ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఉమ్మడి సిలబస్‌తో పాటు పోటీ పరీక్షల్లో నిరుద్యోగులపై భారం తగ్గించేలా, యూపీఎస్సీతో సమానంగా టీఎస్‌పీఎస్సీలోనూ ఉద్యోగ ప్రకటనలు వెలువడేలా సిఫార్సులు చేసింది. నాలుగేళ్లవుతున్నా కీలకమైన సంస్కరణలు అమలు కాకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి సిలబస్, ఉద్యోగకేలండర్‌ను కేరళ, గుజరాత్ రాష్ట్రాలు సమర్థంగా అమలు చేస్తున్నాయి.
- గ్రూప్-1, 2 ఉద్యోగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేయాలి
- ఈ పరీక్షలకు ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తరహాలో ర్యాంకులు ప్రకటించాలి.
- యూపీఎస్సీ ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్‌ఎస్ ఇతర గ్రూప్-ఏ ఉద్యోగాల మాదిరి అభ్యర్థి పొందిన ర్యాంకుల ఆధారంగా గ్రూప్-1, 2 పోస్టులను కేటాయించాలి.
- స్టేట్ సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఒకటి లేదా రెండునెలల వ్యత్యాసం ఉండేలా చూడాలి. ఉమ్మడి సిలబస్‌తో రెండు ఉద్యోగాలకు పోటీపడవచ్చు.
- గ్రూప్-3, 4 ఉద్యోగాలను స్టేట్ సెలక్షన్ కమిటీ ఉద్యోగాల కేటగిరీలోకి మార్చుతూ ఒకే పరీక్ష నిర్వహించాలి.
- యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ తరహాలో టీఎస్‌పీఎస్సీలోనూ ఏటా ఉద్యోగ కేలండర్ అమలు చేయాలి.
- పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల వివరాలను ఏడాదికి ముందుగానే తీసుకుని ఆ ఉద్యోగాల్ని నోటిఫై చేసి, ప్రకటనలు వెలువరించాలి.