తెలంగాణ

telangana

ఈ రైళ్ల వేగం పెరిగింది.. నేటి నుంచి గంటకు 130 కిలోమీటర్లు

By

Published : Sep 12, 2022, 8:27 AM IST

దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలో పలు రైళ్లు నేటి నుంచి మరింత వేగంతో ప్రయాణించనున్నాయి. ఈ మేరకు వాటి గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 110 కి.మీ.ల నుంచి 130 కి.మీ.లకు పెంచినట్లు ద.మ. రైల్వే వెల్లడించింది. జోన్‌ పరిధిలోని పలు ముఖ్యమైన సెక్షన్లలో వేగాన్ని పెంచనున్నట్లు పేర్కొంది.

South Central Railway Zone
South Central Railway Zone

దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలో పలు రైళ్లు ఇక మరింత వేగంతో దూసుకెళ్లనున్నాయి. ఈ మేరకు వాటి గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 110 కి.మీ.ల నుంచి 130 కి.మీ.లకు పెంచినట్లు ద.మ. రైల్వే వెల్లడించింది. జోన్‌ పరిధిలోని పలు ముఖ్యమైన సెక్షన్లలో వేగాన్ని పెంచనున్నట్లు తెలిపింది. ఇది నేటి నుంచే అమల్లోకి రానుంది. జోన్‌ పరిధిలోని సికింద్రాబాద్‌, విజయవాడ, గుంతకల్‌ డివిజన్లలోని అత్యధిక సెక్షన్లలో ఈ వేగం పెరుగుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే రైళ్ల వేగం పెరుగుతున్నప్పటికీ ప్రయాణ సమయం తగ్గడానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. పరిశోధన నమూనాలు, ప్రమాణాల సంస్థ (ఆర్‌డీఎస్‌ఓ-లఖ్‌నవూ) అనుమతించాక 2020 నుంచి ట్రాక్‌ల నిర్వహణ, సిగ్నలింగ్‌ పనులు చేపట్టి పూర్తిచేశారు. సికింద్రాబాద్‌ డివిజన్‌లోని సికింద్రాబాద్‌-కాజీపేట-బల్లార్ష, కాజీపేట-కొండపల్లి; విజయవాడ డివిజన్‌ పరిధిలోని కొండపల్లి-విజయవాడ-గూడూరు; గుంతకల్‌ పరిధిలో రేణిగుంట-గుంతకల్లు-వాడి సెక్షన్లలో గరిష్ఠ వేగం 130 కి.మీ.లకు పెంచారు. ఆయా మార్గాల్లో ఇంతకు మించిన వేగంతో రైళ్లు పరుగులు తీసినా తట్టుకునేలా ట్రాక్‌లను పటిష్ఠం చేశారు. వేగం పెంపునకు కృషిచేసిన అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే ఇన్‌ఛార్జి జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ అభినందించారు.

ప్రయాణ సమయం తగ్గాలంటే..దూర ప్రాంత రైళ్ల ప్రారంభ, గమ్యస్థానాలు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఆయా మార్గాల్లో అనేక డివిజన్లను దాటాలి. అలాగే గరిష్ఠ వేగాన్ని హైదరాబాద్‌, గుంటూరు, నాందేడ్‌ డివిజన్లలో పెంచలేదు. ఇక్కడా ఆ పనులు పూర్తయితేనే రైళ్లు ప్రయాణ సమయం తగ్గుతుంది. విజయవాడ డివిజన్‌లోనూ విశాఖపట్నం వైపు వెళ్లే కీలకమార్గం విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లో రైళ్ల వేగాన్ని పెంచలేదు.

* పలు సెక్షన్లలో 130 కి.మీ.ల గరిష్ఠ వేగంతో రైళ్లు నడిపించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించినా ఆ వేగం ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలున్న రైళ్లకే పరిమితం కానుంది. పాతతరం ఐసీఎఫ్‌ (రైలుపెట్టెల కర్మాగారం) కోచ్‌ల సామర్థ్యం గంటకు గరిష్ఠంగా 110 కిలోమీటర్లే. గోదావరి, గోల్కొండ, నారాయణాద్రి, రాయలసీమ, తెలంగాణ, తిరుపతి-జమ్ముతావి హమ్‌సఫర్‌, లింగంపల్లి-విజయవాడ ఇంటర్‌సిటీ, దక్షిణ్‌, చార్మినార్‌, గుంటూరు ఇంటర్‌సిటీ, జైపుర్‌, ఎల్‌టీటీ దురంతో, కాగజ్‌నగర్‌, విశాఖపట్నం డబుల్‌డెక్కర్‌, ధర్మవరం, కోకనాడ సహా 37 రైళ్లే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తున్నాయి. ఈ రైళ్లకు 54 రేక్‌లు ఉన్నాయి. ఒక్కో రేక్‌లో 22 బోగీ (కోచ్‌)లు ఉంటాయి. జోన్‌లో మొత్తం బోగీల్లో వీటిసంఖ్య ఐదో వంతే.

160 కి.మీ.ల సామర్థ్యం..ఎల్‌హెచ్‌బీ కోచ్‌ (ఏసీ)ల గరిష్ఠ వేగ సామర్థ్యం 160 కి.మీ.లు. ప్రస్తుత ట్రాక్‌ల సామర్థ్యాన్ని ఆ స్థాయికి పెంచితే.. సంబంధిత రైళ్లను మరింత వేగంగా నడిపించొచ్చు. ఈ కోచ్‌లుండే రైళ్లకు ప్రమాదం జరిగినా ప్రాణనష్టం చాలా తక్కువగా ఉంటుంది. ప్రమాదాలు సంభవించేటప్పుడు ఐసీఎఫ్‌ బోగీలైతే ఒకదానిపైకి మరొకటి వెళ్లి అధిక ప్రాణనష్టం ముప్పు ఉంటుంది. అదే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లయితే ప్రమాదాలు జరిగేటప్పుడు భూమిలోకి కూరుకుపోతాయి.

* ద.మ. రైల్వే జోన్‌ పరిధిలో మొత్తం 5,455 బోగీలుండగా.. వాటిలో ఎల్‌హెచ్‌బీ 1,188; ఐసీఎఫ్‌ 4,267 ఉన్నాయి. ఎల్‌హెచ్‌బీ బోగీలున్న 37 రైళ్లకు గాను సగం సికింద్రాబాద్‌ డివిజన్‌లోను.. మిగతావి విజయవాడ, గుంతకల్లు, నాందేడ్‌, గుంటూరు డివిజన్లలోను ఉన్నాయి. ఉత్పత్తి అయిన ఎల్‌హెచ్‌బీ బోగీల్ని రైల్వేబోర్డు జోన్లవారీగా కేటాయిస్తుంది. ఈమేరకు బోర్డుపై ఒత్తిడి చేస్తేగానీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో మన వాటా పెరగదు. మరోవైపు ఎంపిక చేసిన సెక్షన్లలో వేగం పెంచినా ప్రయణికులకు తక్షణమే సమయం కలిసేవచ్చే పరిస్థితి లేదు. రైళ్ల టైంటేబుల్‌లో ఆ మేరకు మార్పులు జరగాలి. ప్రస్తుతం వేగంగా ప్రయాణించినా మార్గమధ్యంలో స్టేషన్లలో, సిగ్నల్‌ పాయింట్లలో గతంలో కంటే అధిక సమయం నిరీక్షించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details