నిజానికి ఒప్పంద ఉద్యోగాలు కొత్తవేమీ కావు. దాదాపుగా ప్రతి రంగంలోనూ వీటి ఉనికి ఉంది. కాకపోతే పర్మనెంట్/ శాశ్వత ఉద్యోగాలతో పోలిస్తే వీటి సంఖ్య చాలా తక్కువ. గత ఏడాది కాలంగా వీటికి గిరాకీ ఏర్పడింది. కొవిడ్ పరిణామాల తరువాత అంతర్జాతీయంగా ఎన్నో రంగాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో ఉద్యోగాలు ఉనికే లేకుండా పోయాయి. ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు. కొన్ని సంస్థలు శాశ్వత ఉద్యోగులను తొలగించి, వారిలో కొంతమందికి కాంట్రాక్చువల్ పద్ధతిలో తిరిగి అవకాశం కల్పించాయి.
ప్రత్యామ్నాయ మార్గం కాంట్రాక్చువల్ ఉద్యోగాలే..
ఒక ప్రముఖ సంస్థ నివేదిక ప్రకారం.. గత ఏడాది జనవరి నుంచి జులై లోపే కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 119 శాతం పెరుగుదల ఉంది. ఇప్పటికీ క్రమంగా పెరుగుతోందిట. ఏటా ఎంతోమంది గ్రాడ్యుయేట్లు జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంటారు. ఈ సంవత్సరం వీరికి గత ఏడాది గ్రాడ్యుయేట్లతోపాటు నిరుద్యోగులూ తోడయ్యారు. దీంతో పోటీ మరింత ఎక్కువైంది. కాబట్టి, మంచి ఉద్యోగం.. కొన్నేళ్లపాటు సాగేదాని కోసం వేచి చూస్తామంటే కుదరని స్థితి. ముందున్న ప్రత్యామ్నాయ మార్గం కాంట్రాక్చువల్ ఉద్యోగాలే. వీటిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు.. సరిగా తీర్చిదిద్దుకోవాలే గానీ ఇవీ భవిష్యత్‌ను మలచుకునే వారధులవుతాయంటున్నారు నిపుణులు.
ఏమిటివి?
రెగ్యులర్ ఉద్యోగాల్లాగే ఇవీ కంపెనీల్లో విధులు నిర్వహించే పనులే. కాకపోతే నిర్ణీత పనిగంటల్లో, నిర్ణీత మొత్తానికి పనిచేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఉద్యోగుల పని కాలవ్యవధి 3 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. సంస్థ, ఎంపికైన హోదాను బట్టి మార్పులుంటాయి. వీటిలోనూ పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలుంటాయి. పనితీరు బాగుంటే సంస్థలే శాశ్వత ఉద్యోగావకాశాన్ని కల్పిస్తాయి. పనివిధానం నచ్చకపోతే మధ్యలోనే బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ ప్రమేయం పెరుగుతోందన్నది తెలిసిన విషయమే. ఇవి అవకాశాలను తెచ్చిపెడుతుండటంతోపాటు ఎన్నో సవాళ్లనూ ముందుంచుతున్నాయి. ఐటీ రంగంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. ఈ సమయంలో ఉద్యోగులకు ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. తమ ఉద్యోగులకు వాటిని నేర్పించడం ఖర్చుతో కూడుకున్న పని అవుతుండటంతో సంస్థలూ వీటికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇక మిగతా రంగాల విషయంలో.. కొన్ని పనులు/ కొన్ని విభాగాల అవసరం ఏడాది పొడవునా ఉండాలనేం లేదు. ఇలాంటప్పుడు ఈ అవసరాలకు పూర్తిస్థాయి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటే డబ్బు, మానవ వనరుల వృథానే. కాంట్రాక్చువల్ ఉద్యోగులు ఈ విషయంలో వారికి సాయపడతారు.
ఎవరు? ఎలా?
వీటిని ప్రత్యేకంగా ఫలానావారే ఎంచుకోవాలన్న నిబంధనేమీ లేదు. చదువుతూ నైపుణ్యం సంపాదించుకోవాలనుకునేవారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, ఉద్యోగాన్ని కోల్పోయినవారు ఎవరైనా వీటిని ఎంచుకోవచ్చు. అవసరమైతే ఎప్పుడైనా మానేసే వీలు ఉండటం వీటి ప్రత్యేకత. కాబట్టి, అవసరమైనవారు ఎంచుకోవచ్చు.
ఆ విషయాలు పొందుపరచాలి..
ఉద్యోగం తాత్కాలికమైనదైనా, శాశ్వతమైనదైనా రెజ్యూమెను తయారు చేసుకోవడం మొదటి ప్రక్రియ. దానిలో తాత్కాలిక ఉద్యోగాలకీ ఆసక్తి ఉన్నట్లుగా దానిలో పొందుపరచాల్సి ఉంటుంది. ఉద్యోగాధారిత సైట్లలో ఆపై నమోదు చేసుకోవాలి. లేదా లింక్‌డిన్ వంటి వాటిలో నేరుగానూ ప్రయత్నించవచ్చు. నచ్చిన స్పెషలైజేషన్, రంగంతోపాటు ఆశిస్తున్న జీతభత్యాల వివరాలనూ పొందుపరచుకోవాలి. అయితే ఉద్యోగాన్ని అందుకునేముందే.. సంస్థ ఆశిస్తున్న అంశాలు, కాలవ్యవధి, పనిగంటలు మొదలైన అంశాలనూ చూసుకోవడం తప్పనిసరి.
శాశ్వతమవ్వాలంటే?