Minister Gautam Reddy Profile : ఆజానుబాహుడు, చూడగానే ఆకట్టుకునే రూపం, పనిలో చురుకుతనం.. మాటల్లో సౌమ్యత.. చిన్నా, పెద్దా ఎవరినైనా సరే ప్రేమగా చిరునవ్వుతో పలకరించడం.. సోమవారం హఠానర్మణం పాలైన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి లక్షణాలివి. రాజకీయాల్లోనూ వివాదరహితుడిగానే పేరొందిన ఆయన తన నియోజకవర్గ ప్రజలతో మమేకమై.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తిరిగివచ్చి 1997లో కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ సారథిగా ప్రొఫెషనల్ జీవితాన్ని ఆరంభించారు. 2012 వరకు సుమారు 15ఏళ్లపాటు సివిల్ కాంట్రాక్టర్‌గా, పారిశ్రామికవేత్తగా కొనసాగారు. కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్, రాజమోహన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎంసీ రోడ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎంసీ పవర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, త్రిశూర్ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్, ఏబీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్, పీచ్ ట్రీ డెవలపర్స్ తదితర 13 కంపెనీల్లో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
రాజకీయ ప్రస్థానం
నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడిగా గౌతమ్‌రెడ్డి 2012లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ ఏడాది నెల్లూరు లోక్‌సభ ఉపఎన్నికల్లో తండ్రి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. 2013లో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమై, ఆ ప్రాంతంపై అవగాహన కోసం 42 రోజుల పాటు నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. 2014లో వైకాపా తరఫున తొలిసారి ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీచేసి 31,438 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 2019లో రెండోసారి 22,276 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదే ఏడాది జూన్ 8న రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
5 శాఖలకు ఏకైక మంత్రి
ఏపీలో ప్రస్తుత మంత్రిమండలిలో అయిదు శాఖల బాధ్యతలను నిర్వర్తించిన ఏకైక మంత్రిగా గౌతమ్‌రెడ్డి గుర్తింపు పొందారు. ఐటీ, పరిశ్రమలు-వాణిజ్యం, పెట్టుబడులు- మౌలిక సదుపాయాలు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి-శిక్షణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. మంత్రిగా చురుకైన పనితీరును కనబరిచారు. తన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం స్వయంగా దిల్లీకి వెళ్లి ఆయా కేంద్ర మంత్రులను కలవడంతోపాటు ఆ మంత్రిత్వ శాఖల్లోనూ అనుశీలన చేయడం ఆయన అలవాటు.
ప్రజలతో మమేకమయ్యేవారు..
రాజకీయాల్లో హుందాగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా వ్యవహరించేవారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవారు. ప్రత్యర్థులైనా, ప్రతిపక్షాల వారినైనా ఒక మాట తూలేవారు కాదు. నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు కూడా ప్రజల ఇళ్లలోకే వెళ్లడం.. ఏమక్కా? ఏం తమ్ముడు అంటూ పలకరిస్తూ వారితో సొంత మనిషిలా కలిసిపోయేవారు. దాదాపు 20 ఏళ్లుగా తన కారు డ్రైవర్‌గా పని చేస్తున్న నాగేశ్వరరావును కూడా గౌతమ్ ఎప్పుడూ తిట్టలేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
బాడీబిల్డర్ మంత్రి!
బాడీ బిల్డర్ మంత్రిగా గౌతమ్‌రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయనను చూడగానే ఎవరికైనా శారీరక దారుఢ్యానికి ఎంత ప్రాధాన్యమిస్తారో ఇట్టే అర్థమైపోతుంది. రోజూ ఉదయం గంటన్నరపాటు, ఉదయం కుదరని రోజున సాయంత్రం, సాయంత్రం ఆలస్యమైనా సరే రాత్రయినా కసరత్తులు తప్పనిసరిగా చేసేవారు. ఇందుకోసం మంగళగిరిలో తన కార్యాలయం ఉన్న ఏపీఐఐసీ భవనంలో, నెల్లూరులోని నివాసంలో, ఆత్మకూరులోని క్యాంపు కార్యాలయంలో, హైదరాబాద్‌లోని నివాసంలో ప్రత్యేకంగా జిమ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. పర్యటనలకు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు కూడా తాను విడిది చేసే హోటళ్లలో ఉండే వ్యాయామశాలల్లోనూ వర్కవుట్లు చేసేవారు.
వ్యక్తిగతం
- స్వస్థలం: ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి జననం : 2-11-1971
- తల్లిదండ్రులు: రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి
- కుటుంబం: భార్య శ్రీకీర్తి, కుమార్తె సాయి అనన్యరెడ్డి, కుమారుడు అర్జున్ రెడ్డి
- విద్యాభ్యాసం: ఊటీలోని గుడ్‌షెపర్డ్‌లో పాఠశాల విద్య, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్లస్ టూ, భద్రుకా కళాశాలలో డిగ్రీ, మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్) పూర్తి చేశారు.
బాధితులకు బాసట
- రెండు నెలల కిందట నెల్లూరు జిల్లా సంగం మండలంలోని బీరాపేరు వాగులో ఆటో బోల్తాపడ్డ దుర్ఘటనలో నవదీప్ అనే బాలుడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలాడు. బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి గౌతమ్‌రెడ్డి నవదీప్ బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. మర్నాడే రూ.10 లక్షల సొంత సొమ్మును అతడి పేరుతో డిపాజిట్ చేశారు. సంక్రాంతికి ముందు రోజు స్వయంగా కొత్త దుస్తులు తీసుకువెళ్లి ఆ అబ్బాయికి ఇచ్చి బాగా చదువుకోవాలని సూచించారు.
- గత నెల 5న సంగం ఎసీˆ్స కాలనీకి వచ్చారు. అక్కడ కనిపించిన బాలలతో మాటలు కలిపారు. పాఠశాలలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెప్పడంతో కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకుని, వారితో కలసి అర కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు వచ్చారు. అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పరిశీలించి, వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
- గత వరదల సమయంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాలు జలమయమవగా స్వయంగా తెప్పల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లి, బాధితులకు మనోధైర్యం కల్పించారు. సహాయచర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.
చివరిగా దుబాయిలో పర్యటన
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి హోదాలో గౌతమ్‌రెడ్డి ఈ నెల 11 నుంచి 19 వరకు దుబాయిలో పర్యటించారు. 11 నుంచి 17 వరకు జరిగిన దుబాయి ఎక్స్‌పోలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను దగ్గరుండి పర్యవేక్షించారు. పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. ఈ నెల 13న దుబాయిలోని తాజ్ బిజినెస్‌బే హోటల్‌లో ప్రవాసాంధ్రులతో ఏపీఎన్‌ఆర్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని... వారిని ఉద్దేశించి తెలుగులో ప్రసంగించారు. దుబాయి ఎక్స్‌పో ముగిశాక కూడా రెండు రోజులు అక్కడే ఉన్న మంత్రి పలు సమావేశాల్లో పాల్గొన్నారు. ఏపీలో రూ.5,150 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన అయిదు ఎంవోయూలపై వివిధ కంపెనీలతో మంత్రి సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉదయం తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి దుబాయి పర్యటన విశేషాలను వివరించాలనుకున్నారు.
మంత్రి దుబాయి పర్యటనలో ముఖ్యాంశాలు..
- గౌతమ్‌రెడ్డి తన చివరి ఇంటర్వ్యూను దుబాయికి చెందిన ఖలీజ్‌టైమ్స్‌కి ఇచ్చారు. ఆ ఛానల్ అసిస్టెంట్ ఎడిటర్ అంజనా శంకర్ ఆయనను ఇంటర్వ్యూ చేశారు.
- దుబాయిలో అలానా గ్రూప్ ఏర్పాటు చేసిన ‘గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్’ను మంత్రి పరిశీలించారు. బిస్కెట్లు, చాక్లెట్ల తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ఏర్పాటు చేయబోయే ఫుడ్ పార్కులు, ఆహారపదార్థాల తయారీ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని అలానా గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ అలానాను కోరారు.
- ఏపీలో రెండు లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు దుబాయికి చెందిన షరాఫ్ గ్రూప్‌తో మంత్రి సమక్షంలో ఒప్పందం జరిగింది.
- ఏపీలో అల్యూమినియం కాయిల్, ప్యానళ్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నారు.
- జీ42 గ్రూప్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు.
- అబుదాబీలోని డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టులను గౌతమ్‌రెడ్డి సందర్శించారు. భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు.
ఆయనలో కోపం అనేది చూడలేదు..
2014 గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆయనకు నేను గన్‌మెన్‌గా ఉన్నా. ఈ రోజు వరకు ఆయనలో కోపమనేదే చూడలేదు. ఎవరిపైనా కోపగించుకున్న సందర్భమే లేదు. ఎవరినైనా చిరునవ్వుతో పేరు పెట్టి పిలిచి మాట్లాడేవారు.