సెనగ పంటకు మద్దతు ధర దక్కడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఉత్పత్తయ్యే 2.31 లక్షల టన్నులను మద్దతు ధరకు కొనాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కేంద్రం తిరస్కరించింది. పంటను పూర్తిగా కొనడం సాధ్యం కాదని, 58,485 టన్నులే కొంటామని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయం మేరకే కొంటామని ‘జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య’ (నాఫెడ్) తాజాగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు సమాచారమిచ్చింది. నాఫెడ్ తరపున పంట కొనుగోలుకు ‘రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య’ (మార్క్‌ఫెడ్)ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38 కొనుగోలు కేంద్రాలను తెరవాలని సూచించింది.
సాధారణం కన్నా పెరిగిన సాగు
ఈ సీజన్‌లో సెనగ పంట సాధారణ విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు కాగా.. రైతులు 3.52 లక్షల ఎకరాల్లో సాగు చేశారని వ్యవసాయశాఖ అధ్యయనంలో తేలింది. వరి వేయవద్దని ప్రభుత్వం చెప్పడంతో వారు ప్రత్యామ్నాయంగా సెనగ వైపు మొగ్గు చూపారు. ఎకరానికి సగటున 6.75 క్వింటాళ్ల పంట పండుతుందని సర్వేలో గుర్తించారు. క్వింటాకు రూ.5,230 మద్దతు ధరను కేంద్రం ప్రకటించినా పలు ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యాపారులు రూ.3 వేల నుంచి రూ.5 వేలలోపే చెల్లిస్తున్నారు. వరి వద్దని.. ఇతర పంటలు వేయాలని ప్రభుత్వమే చెప్పినందున దిగుబడి మొత్తం మద్దతు ధరకు కొనాలని రైతుసంఘాలు కోరుతున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తెరిచి 8 వేల టన్నులు కొన్నట్లు మార్క్‌ఫెడ్ వర్గాలు ‘ఈనాడు’కు తెలిపాయి. కేంద్రం అనుమతించిన దానికన్నా అదనంగా కొనడం సాధ్యం కాదని స్పష్టంచేశాయి. 58 వేల టన్నులు పూర్తికాగానే కొనుగోలు కేంద్రాలు మూసివేయాలని మార్క్‌ఫెడ్ యోచిస్తోంది.