తెలంగాణ

telangana

ETV Bharat / city

కాసుల కక్కుర్తి.. రెమ్​డెసివిర్​ పేరిట దోపిడి దందా - telangana latest news

కొవిడ్​ విలయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.. కొన్ని ఆస్పత్రులు. రోగులకు అండగా ఉండాల్సింది పోయి.. దండిగా దోచుకుంటున్నాయి. రెమ్‌డెసివిర్‌ పేరిట కొన్ని ఆసుపత్రులు భారీ అక్రమాలకు తెరతీస్తున్నాయి.

remdesivir injection
రెమ్​డెసివిర్​ పేరిట దోపిడి దందా

By

Published : Apr 28, 2021, 6:55 AM IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో మానవత్వం మరచిన కొన్ని ఆసుపత్రులు, వాటికి వత్తాసు పలికే వైద్యులు కొత్తరకం దోపిడీకి తెరతీశారు. కొవిడ్‌ రోగుల అత్యవసర పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకుంటూ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను అధిక ధరలకు బాధితులతో కొనుగోలు చేయిస్తున్నారు. సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్న నాలుగు కేసుల్లో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను కాసుల కక్కుర్తితో ఆసుపత్రుల నిర్వాహకులే దారిమళ్లించినట్లు గుర్తించారు. మరో కేసులో అనంతపురం ఆసుపత్రి నుంచి ఇంజక్షను బయటికొచ్చినట్లు ఎల్బీనగర్‌ పోలీసులు తేల్చారు.

కోలుకుంటారు అనే రోగుల విషయంలో..

కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఔషధ సంస్థల నుంచి నేరుగా ఇంజక్షన్లు దిగుమతి చేసుకొని, రోగుల వద్ద నుంచి అధిక మొత్తంలో ధరలు వసూలు చేస్తున్నాయి. కృత్రిమ కొరత సృష్టిస్తూ తాము కోరినంత డబ్బును ముట్టజెప్పేలా పావులు కదుపుతున్నాయి. దళారులను రంగంలోకి దింపి వారి ద్వారా ఇంజక్షన్లను కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తున్నాయి.

ఒకటో రెండో ఇచ్చి...

కొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌తో కోలుకుంటున్న రోగికీ రెమ్‌డెసివిర్‌ అవసరమంటూ వైద్యులు చీటి రాసిస్తున్నారు. ఒక సెట్‌(ఆరు ఇంజక్షన్లు)ను తప్పనిసరిగా తెప్పిస్తున్నారు. వాటిలో ఒకటి లేదా రెండు ఇస్తున్నారు. మిగిలిన వాటిని పక్కన పెట్టేస్తున్నారు. రోగి చికిత్స పత్రాల్లో మాత్రం రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఇచ్చినట్లుగా రాస్తున్నారు. అలా మిగిలిన ఇంజక్షన్లను తిరిగి నల్లబజారులో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు నిగ్గు తేల్చారు.

సామాజిక మాధ్యమాల్లో ప్రచారం

ఫలానా చోట రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయంటూ కొన్ని ఆసుపత్రుల నిర్వాహకులే సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. అది చూసి చాలా మంది వాటి కోసం అక్కడ పేర్కొన్న నంబర్లలో సంప్రదిస్తున్నారు. ఎన్నో విధాలుగా ప్రాధేయపడితే సరే ఆగండి.. మాకు తెలిసిన వ్యక్తి దగ్గర ఉన్నాయేమో కనుక్కుని చెప్తానంటూ ఫోన్‌ కట్‌ చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ కాల్‌ చేసి ఒక్కోదానికి రూ.40 వేలు చెబుతున్నారు.. మీ కోసం రూ.30 వేలకు మాట్లాడాను.. ఫలానా చోటుకెళ్లి తీసుకోండి అంటూ సూచిస్తున్నారు. వాళ్లు అక్కడికి వెళ్లేలోపు ఫార్మాసిస్ట్‌/అడ్మిన్‌/సెక్యూరిటీతో ఇంజక్షన్లను పంపిస్తున్నారు. ఈ విషయం దర్యాప్తులో వెల్లడైందని సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. మరికొన్ని ఆసుపత్రుల నిర్వాహకులేమో తమ చేతికి మట్టి అంటకుండా మధ్యవర్తులకు విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు.

గడువు తీరిన వాటిని అమ్మారంటూ రెండ్రోజుల కింద ఎల్బీనగర్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఇక్కడ కూపీ లాగితే డొంక అనంతపూర్‌లో కదిలింది. ఓ ఆసుపత్రికి చెందిన ఫార్మాసిస్ట్‌ ఇంజక్షన్లను మధ్యవర్తికి విక్రయించినట్లు గుర్తించారు.

ఇవీచూడండి:టీకా వేసుకుంటే కొవిడ్‌ బారిన పడే అవకాశాలు చాలా స్వల్పం: సుచిత్ర ఎల్ల

ABOUT THE AUTHOR

...view details