వరద చుట్టేసిన కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరి ముంపు బాధితులు పడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఎలాగోలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చి బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. ఇళ్లల్లోని టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఇతర విద్యుత్తు ఉపకరణాలన్నీ నీటిలో నానిపోయి పాడయ్యాయని వరద బాధితులు వాపోతున్నారు. దీనికితోడు సోఫాలు, కుషన్ కుర్చీలు, మంచాలు, పరుపులు, బట్టలు.. ఇలా ఇంట్లోని వస్తువులన్నీ వరదనీటిలో నానుతున్నాయి. చెరువులు ఉప్పొంగి వరద ఒక్కసారిగా వచ్చేసరికి చాలా మంది బాధితులు కట్టుబట్టలతో బయటకు వచ్చేశారు. కొందరు ఉన్నంతలో బట్టలు, దుప్పట్లు వంటివి తీసుకుని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ఇళ్లల్లో మోకాలి లోతు నీరు చేరి వస్తువులన్నీ పాడయ్యాయని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా గృహోపకరణాలకు మరమ్మతులు చేయాలంటే రూ.లక్షలు వెచ్చించాలని, ఇది ఆర్థికంగా మరింత భారమవుతుందని వాపోతున్నారు.
‘మా కుటుంబం 2009 నుంచి ఇక్కడే ఉంటోంది. మాది హుడా అనుమతి ఉన్న లే అవుట్. కాలనీలోని చాలా ఇళ్లలో రెండు, మూడు అడుగుల ఎత్తులో నీరు నిలిచింది. మా ఇంట్లో ఫ్రిజ్ మొదలుకుని సోఫాల వరకు అన్నీ పాడయ్యాయి. దాదాపు రూ.5 లక్షల విలువైన సామగ్రి పాడైపోయింది. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు నీటిలో నానుతోంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. చెరువు ముంపు జలాలు కాలనీల్లోని ఇళ్లను చుట్టేసి ఇంట్లోకి వెళ్లలేక బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నాం.’
- కల్యాణచక్రవర్తి, హరిహరపురం కాలనీ