హైదరాబాద్ చుట్టుపక్కల తప్ప మిగిలిన జిల్లాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. దశాబ్దకాలం నుంచే ఒక్కొక్కటి మూతపడుతుండగా.. ఆరేడు సంవత్సరాల్లో పదుల సంఖ్యలో కాలగర్భంలో కలిసిపోయాయి. జిల్లాల్లో 40 మిగలగా.. వాటిలో 20 నుంచి 30 కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సీఎస్‌ఈ, ఈసీఈ తప్ప మిగిలిన కోర్సుల్లో పట్టుమని పది మందీ చేరడం లేదు. 2014-15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 14 ప్రభుత్వ, 234 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి.
రెండు మాత్రమే..
తాజా కౌన్సెలింగ్‌లో 175 కళాశాలలు పాల్గొన్నాయి. వీటిలో 15 ప్రభుత్వ కళాశాలలు కాగా.. మిగిలిన 160 ప్రైవేటు కాలేజీలే. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 48 కళాశాలలుండగా ఇప్పుడు 11కి తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లాలో 28 ఉండగా ఎనిమిదికి పడిపోయాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11 ఉండగా.. రెండు మాత్రమే మిగిలాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి.
మెకానికల్ బ్రాంచిలో ఒక్కరూ చేరలే..
తాజాగా ఎంసెట్ మొదటి విడత కేటాయింపులో నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లో సీఎస్‌ఈ, ఈసీఈ తప్ప మిగిలిన బ్రాంచీల్లో... పది లోపు సీట్లు భర్తీ అయిన కళాశాలలే అధికంగా ఉన్నాయి. కొన్ని కళాశాలల్లోని మెకానికల్ బ్రాంచిల్లో ఒక్కరూ చేరలేదు. ఈ విద్యా సంవత్సరంలో రెండు ప్రైవేట్ కళాశాలలు కొత్తగా ఏర్పాటు కాగా.. అవీ హైదరాబాద్‌లోనే వచ్చాయి. పదో తరగతి పూర్తి కావడమే ఆలస్యం.. ఇంటర్‌లో ప్రవేశానికి గ్రేటర్ హైదరాబాద్‌లోని కళాశాలలకే తమ పిల్లల్ని తల్లిదండ్రులు పంపిస్తున్నారు. ఇక్కడి కళాశాలల్లో చదివినవారు... ఆ తర్వాత సొంత జిల్లాల్లో ఇంజినీరింగ్ చదివేందుకు ఇష్టపడటం లేదు. ఏడేళ్లలో 74 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడ్డాయి. వాటిలో హెచ్‌ఎండీఏ పరిధిలోనివి 20 ఉండగా.... జిల్లాల్లోనివి 54 కాలేజీలు ఉన్నాయి.
ఉద్యోగావకాశాలు నగరాల్లోనే ఎక్కువ కాబట్టి అక్కడ చదివేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని నిపుణులు అంటున్నారు. నగరాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లపై పరిమితి విధిస్తే..... జిల్లాల్లోని కళాశాలలు మనుగడ సాధిస్తాయని యాజమాన్యాలు అంటున్నాయి.
ఇదీచూడండి:KTR: కేటీఆర్ పెద్దమనసు.. ఆ అమ్మాయికి ఉద్యోగం