హైదరాబాద్ మెట్రో రైలు స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజులను అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. సౌకర్యాల పేరుతో సరికొత్త దందాకు తెరతీశారు. ద్విచక్ర వాహనం నిలిపితే పార్కింగ్ ఫీజు 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. మెట్రో స్టేషన్ పార్కింగ్ ఏరియాలో వాహనం ఆపగానే పాతిక రూపాయలు కట్టించుకుంటున్నారు. గంటలో వస్తానన్నా కూడా ఇంతే ఛార్జీ అని దబాయించి మరీ వసూలు చేశారు. రోజు మొత్తం నిలిపితే ఎంత వసూలు చేస్తారో.. గంట, రెండు గంటలకూ అంతే వసూలు చేయడంపై వాహనదారులు మండిపడుతున్నారు. కొంతకాలంగా పార్కింగ్ దోపిడిపై తరచూ ఫిర్యాదులు వస్తున్నా.. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దబాయించి మరీ వసూళ్లు..
ద్విచక్ర వాహనాలకు 3 గంటల లోపు అయితే 15 రూపాయలు, 3 గంటల నుంచి రోజంతా అయితే పాతిక రూపాయలు చెల్లించాలని అని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. కానీ 15 రూపాయలు ఎక్కడా తీసుకోవడం లేదు. దబాయించి మరీ పాతిక రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రీపెయిడ్ కావడంతో ఐదు నిమిషాలు ఆపినా.. రెండు గంటలు ఆపినా తమకు సంబంధం లేదని ఏకంగా రూ.25 ముందే తీసుకుంటున్నారు. మెట్రో రైలులో ప్రయాణించాలంటే కనీస ఛార్జీ రూ.10 ఉండగా.. పార్కింగ్ ఛార్జీ 25 రూపాయలు తీసుకోవడంపై ప్రయాణికులు, ఆపరేటర్లకు నిత్యం వాగ్వాదాలు జరుగుతున్నాయి.