తెలంగాణ

telangana

ETV Bharat / city

పురోగతిలో ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల పరిశ్రమ.. ఎగుమతుల్లో భారీగా వృద్ధి - Manufacturing of engineering equipment

Engineering Equipment Production in Telangana: ఇంజినీరింగ్‌ పరికరాల తయారీలో తెలంగాణ రోజురోజుకూ పురోగతి సాధిస్తోంది. ఫలితంగా ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి సాధించడంతో ఉపాధి పెరిగింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించడంతో దేశవిదేశాల నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి.

Engineering Equipment Production in Telangana
పురోగతిలో ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల పరిశ్రమ

By

Published : May 15, 2022, 7:50 AM IST

Engineering Equipment Production in Telangana: చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో శ్రీనివాస్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగు పరికరాల తయారీదారు. గత నాలుగు నెలలుగా ప్రముఖ సంస్థల నుంచి ఆర్డర్లు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. మూడు పూటలా పరికరాలను తయారు చేస్తూ.. ఎగుమతి చేస్తున్నారు.

బాలానగర్‌ పారిశ్రామికవాడలో రాజ్‌కుమార్‌ భారీ పరిశ్రమలకు అవసరమైన ఇంజినీరింగు సామగ్రి ఉత్పత్తిదారు. గతంలో ఎగుమతులకు డిమాండు ఉండేది కాదు. కరోనా అనంతర పరిస్థితుల్లో గిరాకీ పెరిగింది. ఇప్పుడు చేతినిండా పనితో ముందుకెళ్తున్నారు. తన వద్ద ఉన్న కార్మికులతో పాటు కొత్తగా పది మందిని తీసుకున్నారు.

తెలంగాణలో ఇంజినీరింగు పరికరాల తయారీ పెద్దఎత్తున సాగుతోంది. ఎగుమతుల్లో ఐటీ, ఔషధ ఉత్పత్తులు, రసాయనాల తర్వాత స్థానంలో ఇంజినీరింగు ఉత్పత్తులున్నాయి. బేరింగులు, లిడ్‌, సాఫ్ట్‌డ్రైవ్‌లు, నిప్పల్‌, నట్లు, బోల్ట్‌లు, రోలర్లు, మోటార్లు, డిస్క్‌లు, డ్రమ్ములు, ప్యాకర్లు, టెలిస్కోపిక్‌ కవర్లు, హ్యాంగర్లు, స్క్రూలు, స్టాండ్‌లు తదితరాలు తయారవుతున్నాయి. చైనా ఉత్పత్తులపై ఆంక్షల తర్వాత భారత్‌లో ఇంజినీరింగు పరికరాలకు డిమాండ్‌ పెరిగింది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఈ రంగం భారీగా పుంజుకుంది. ప్రస్తుతం 12,954 ఇంజినీరింగు ఉత్పత్తుల పరిశ్రమలుండగా... కొత్తగా ఏర్పాటవుతున్న వాటిలోనూ ఇవే అధికంగా ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, జర్మనీ, బంగ్లాదేశ్‌, మలేసియా, సింగపూర్‌ తదితర దేశాలతో పాటు భారత్‌లోని 16 రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఉత్పత్తులు వెళ్తున్నాయి. అంతరిక్ష ఉపగ్రహాలు, క్షిపణులు, ఇస్రో రాకెట్లకు విడిభాగాలు ఇక్కడే తయారవుతున్నాయి. విమానాలు, హెలికాప్టర్ల పరిశ్రమ అభివృద్ధి చెందడంతో వాటికి అవసరమైన పరికరాలను కూడా పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు.

ఇంజినీరింగు ఉత్పత్తులకు స్థానిక మార్కెట్‌ కంటే ఎగుమతులకే ఎక్కువ డిమాండు ఉంటోంది. లాజిస్టిక్స్‌, కార్గోతో పాటు కాకినాడ, విశాఖపట్నం, ముంబయి, చెన్నైలలోని ఓడరేవుల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. ఏటేటా పరిశ్రమ వృద్ధి చెందుతోంది. ఈ రంగం పురోగతితో ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా నాలుగున్నర లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.

ఆశాజనకంగా ఎగుమతులు: తెలంగాణ ఇంజినీరింగు ఉత్పత్తులకు విశేష ఆదరణ లభిస్తోంది. దేశ,విదేశాల నుంచి ఆర్డర్లు భారీగా వస్తున్నాయి. మరోవైపు ముడిసరకుల ధరలు పెరుగుతున్నాయి. దీనిపై సర్కారు దృష్టి సారించాల్సి ఉంది. - వాకిటి రాంరెడ్డి, ఇంజినీరింగు విడిభాగాల పరిశ్రమ, కూకట్‌పల్లి పారిశ్రామికవాడ

మెగాలాజిస్టిక్స్‌ పార్కు ప్రారంభించాలి: తెలంగాణలో ఇంజినీరింగు ఉత్పత్తులకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. దేశ, విదేశీ అవసరాల దృష్ట్యా ఎగుమతులను ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహించాలి. మెగా లాజిస్టిక్స్‌ పార్కును ప్రారంభించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఓడరేవుతో ఒప్పందం చేసుకోవడం వల్ల ఎగుమతులు మరింత పెరిగే వీలుంది. చిన్నతరహా పారిశ్రామికవేత్తలే ఎక్కువ సంఖ్యలో ఎగుమతులు చేస్తున్నందున ప్రత్యేక రాయితీలివ్వాలి. - సిలివేరు చంద్రయ్య, శ్రీవేన్‌ ప్రెసిటెక్‌, గాంధీనగర్‌ పారిశ్రామికవాడ

ఇవీ చదవండి:Amith shah On CM Kcr: ఇంత అసమర్థ సీఎంను నేనెప్పుడూ చూడలేదు: అమిత్ షా

"జనగణమనలో 'సింధ్'​ను తొలగించండి.. పాక్​ను కీర్తిస్తూ పాడేదెలా?"

ABOUT THE AUTHOR

...view details