ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సూరాబాద్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలోని స్థలం కబ్జా అవుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని స్ధానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు ఆక్రమణ గురించి ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ శాఖ అధికారులకు గతంలో ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
పెద్ద చెరువు ఆక్రమణకు గురవుతోందని అధికారులపై కార్పొరేటర్ సీరియస్ - కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి
మన్సూరాబాద్ పెద్దచెరువు ఆక్రమణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ నర్సింహా రెడ్డి అధికారులను ఆదేశించారు. చెరువు స్థలం ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత యంత్రాంగం ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన వారిని ప్రశ్నించారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ సూచించారు.
సుష్మా నుండి పెద్ద చెరువు బీరప్ప గుడి వరకు బాక్స్ నాలా పనులు వైష్ణవి కో-ఆపరేటీవ్ సొసైటీ సభ్యులు వేసిన కోర్టు స్టే వలన ఆగిపోవడంతో ముంపు ప్రాంత కాలనీలకు, పెద్ద చెరువు ప్రాంగణమంత మురుగునీటితో కలుషితం అవుతోందని తెలిపారు. కోర్టు స్టే మాత్రం అభివృద్ధి పనులకు ఆటకం అయినప్పుడు అదే ప్రాంతంలో ఎఫ్టీఎల్ స్ధలం కబ్జా కావడానికి మాత్రం వర్తించదా అని కార్పొరేటర్ ప్రశ్నించారు. తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్‌వో రాచర్ల శ్రీనివాస్, జవాన్ శ్రీనివాస్, ఎఫ్ఎస్ఏ రవి, భాజపా నాయకులు యంజాల జగన్ పాల్గొన్నారు.