Mango Farmers Problems: తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు కాలం కలిసి రావడం లేదు. హైదరాబాద్ శివారు బాటసింగారం పండ్ల మార్కెట్‌కు మామిడి తరలివస్తోంది. బంగినపల్లి, దశేరి, హిమాయత్, కేసర్, తోతాపురి వంటి రకాలు వస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే మార్కెట్‌కు మామిడి కాయల రాక చాలా వరకు తగ్గిపోయింది. నాణ్యత ఆధారంగా ధరలు చెల్లిస్తున్నారు. శనివారం బాటసింగారం పండ్ల మార్కెట్‌లో టన్ను మామిడి కనిష్ఠ ధర 20 వేల రూపాయలు.. గరిష్ఠ ధర 55 వేల రూపాయలుపైగా పలికింది. ఎన్నో వ్యయ, ప్రయాసల కోర్చి సరకు తీసుకొస్తే.... నాణ్యత పేరిట కొర్రీలు పెడుతూ కమీషన్ ఏజెంట్లు సరైన ధర చెల్లించడంలేదని రైతులు వాపోతున్నారు.
వడగండ్ల వానలు, గాలిదుమారం భయంతో చాలా మంది రైతులు కాయ పక్వానికి రాక ముందే తెంపుకుని మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. రెండేళ్లుగా కొవిడ్ ప్రభావం, లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా సరఫరా చాలా వరకు దెబ్బతింది. ఆ ప్రభావం హైదరాబాద్ మార్కెట్‌పై పడింది. రెండ్రోజుల కిందటి వరకు మామిడి ధరలు బాగా ఉన్నప్పటికీ.... తాజాగా కాస్త ధరలు పడిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని కమీషన్ ఏజెంట్లు చెబుతున్నారు.