హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన ఓ యువకుడు ఎంఎన్సీలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఇంట్లో ఉంటూ కాలక్షేపం కోసం ఫోన్లో ఆటలు మొదలుపెట్టారు. మధ్యలో జూదానికి సంబంధించిన ప్రకటనలు వచ్చేవి. ఎందరో ఇంట్లోనే ఉంటూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారన్న ప్రకటనలు ఆసక్తికరంగా ఉండటం వల్ల వాటి వైపు దృష్టి మళ్లింది. ఒక్క ఆటలో రూ.3 వేలు వచ్చాయి. రోజూ ఆడటం మొదలుపెట్టారు. పది రోజులు గడిచేసరికి నష్టం రూ. లక్షకు చేరింది. ప్రస్తుతం ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. ఆన్‌లైన్లోనే కాదు.. మామూలుగా కూడా అనేక మంది జూదం ఆడుతున్నారు.
రోజుకు ఐదు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇలాంటి కేసులు రోజుకు కనీసం మూడు నుంచి ఐదు నమోదవుతున్నాయి. చుట్టుపక్కల వారు ఇస్తున్న సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకుంటున్నారు. పట్టుబడని కేసుల సంఖ్య లెక్కే లేదు.
ఉన్నది కూడా పోతోంది..
రోజుల తరబడి ఇంటికే పరిమితం కావడంతో కాలక్షేపం కోసం ప్రజలు అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎవరింట్లో వారే ఉండాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అనేక ప్రాంతాల్లో కొందరు బంధుమిత్రులు కలిసి జూదం వైపు మళ్లుతున్నారు. ఇందులో లాభపడ్డ వారు ఒక్కరుంటే నష్టపోతున్న వారి సంఖ్య పదుల్లో ఉంటోంది. అసలే సంపాదన లేదు. ఇప్పుడు ఆశకు పోయి దాచిపెట్టుకున్నది కూడా పోగొట్టుకుంటున్నారు. రాజధాని పరిధిలోని మూడు కమిషనరేట్లలోనూ రోజూ జూదం కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాల ట్రాఫిక్ 40 శాతానికి పైగా పెరిగిందని, ఆన్‌లైన్లో ఆటలాడేవారి సంఖ్య గతంతో పోలిస్తే రెట్టింపైందని నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్లో జూదం ఆడటం నేరం. ఈ విషయం తెలిస్తే ఆడినవారిపైనా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అందుకే డబ్బు పోగొట్టుకుంటున్న వారు కిక్కురుమనడంలేదు.
ఇదీ చూడండి:కాంక్రీట్ మిక్సర్ ట్యాంక్‌లో 18 మంది కూలీల ప్రయాణం