తెలంగాణ

telangana

ETV Bharat / city

అందుకోసం ఒక్క పూటలో అందంగా రెడీ అవ్వండి...! - valaintains day tips for women

చూస్తుండగానే వాలంటైన్స్‌ డే వచ్చేస్తోంది. మీ ప్రియమైన వారిని ఎక్కడ కలవాలో, ఏ బహుమతి ఇవ్వాలో, ఆ రోజంతా వారితో ఎలా గడపాలో ప్లాన్ చేశారా..? మరి మీరు మీ వాలంటైన్‌ని కలవడానికి ఎలా రడీ అవ్వాలో కూడా ఆలోచించుకున్నారా..? ఏదైనా ప్రత్యేకమైన రోజు దగ్గరపడుతోందంటే అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందు నుంచీ ప్లాన్ చేసుకోవడం మనకు అలవాటే. కానీ పనులు ప్లాన్ చేసుకున్నంత శ్రద్ధగా మనల్ని మనం పట్టించుకోం. తీరా ఆరోజు హడావుడిగా తయారై ఏదోలా కానిచ్చేస్తాం. ఇక నుంచీ అలా కాకుండా మనకోసం మనం ఒక్క పూట కేటాయించుకుని, ప్రేమికుల దినోత్సవం వంటి ప్రత్యేకమైన సందర్భంలో మరింత ప్రత్యేకంగా కనిపించేద్దాం. అదెలాగంటే...

makeup tips for valaintains day
makeup tips for valaintains day

By

Published : Feb 13, 2021, 3:27 PM IST

ముచ్చటైన మోము కోసం..

అందం విషయంలో తొలి ప్రాధాన్యం ముఖానికే! ఈ క్రమంలోనే ముఖం, కళ్లు, పెదాలు.. వంటి ముఖ భాగాలు కళగా ఉంటేనే ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది. అందుకోసం ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరి!

  • చివరి నిమిషంలో అందంగా కనపడాలన్న ఆలోచనతో కనుబొమ్మలు సరిచేయడం, ముఖంపై గల అవాంఛిత రోమాలను తొలగించడం చేయకూడదు. కనుబొమ్మలు మరీ ఎక్కువగా పెరిగాయనుకుంటే చుట్టూ ఉన్న కొన్ని వెంట్రుకలను మాత్రం తొలగించి, మిగిలిన వాటిని కన్సీలర్ సహాయంతో చర్మం రంగులో కలిసేలా చేయాలి. తద్వారా సహజసిద్ధంగా కనిపించే అవకాశం ఉంటుంది.
  • ఒకవేళ కళ్ల కింద నలుపు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే చల్లని పాలలో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని కాసేపు కునుకు తీయండి. అదే సమయంలో అందుబాటులో ఉన్న ఏదైనా ఒక పండు గుజ్జునో లేక టొమాటో రసాన్నో ముఖానికి, మెడకి ప్యాక్‌లా వేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ఒకేసారి రెండు పనులు పూర్తవుతాయి.
  • సరైన నిద్ర మీ ముఖాన్ని మరింత కాంతివంతం చేస్తుందని మర్చిపోకండి. అందుకే రోజుకు ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం.
  • టీత్ వైటెనింగ్ చేయించుకునే సమయం లేనప్పుడు టూత్ పేస్టు బదులు కాస్త ఉప్పు, చిటికెడు వంటసోడా కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు మిలమిలా మెరుస్తాయి.
  • పెదాలను చక్కెరతో స్క్రబ్ చేసి, కడిగిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

కురులు కూడా ముఖ్యమే!

హెయిర్ ప్యాక్ వేసుకునే సమయం లేకపోతే నాలుగు విటమిన్-ఇ ట్యాబ్లెట్లను కత్తిరించి, అందులోని లిక్విడ్‌ని మీ వెంట్రుకలకు సరిపడేంత కొబ్బరి నూనెలో కలిపి కుదుళ్ల నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. ఆపై ఒక ఐదు నిమిషాలు మర్దన చేసి ఇరవై నిమిషాల తర్వాత షాంపూ చేసుకోవాలి. (కళ్లకు, ముఖానికి ప్యాక్ వేసుకున్న సమయంలోనే ఈ నూనెను కూడా అప్లై చేసుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది.)


మృదువైన చేతులు, సున్నితమైన పాదాల కోసం..!

  • మెనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకునే సమయం లేనప్పుడు చేతికి, కాలికి ఉన్న గోళ్లని షేప్ చేసుకుని, హెయిర్ మాస్క్ కోసం తయారు చేసుకున్న కొబ్బరి నూనె మిశ్రమాన్ని పట్టించాలి.
  • మడమలకి ఉన్న పగుళ్లని, మృత చర్మాన్ని స్క్రబ్బర్‌తో తొలగించాలి.
  • ఇందాక తయారు చేసుకున్న ఫేస్‌ప్యాక్‌ని గోళ్ల భాగం వదిలి.. కాళ్లు, చేతులకు రాసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి. కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

ఇలా ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఒక్క పూటలో అందంగా మెరిసిపోవచ్చనే విషయం తెలుసుకున్నారుగా...! మరి, మీరూ ఈ బ్యూటీ టిప్స్‌ని ఫాలో అయిపోయి మీ మనోహరుడి మనసు మరోసారి దోచేయండి...!

ఇదీ చూడండి:ఐ లవ్యూ అని చెప్పడం కామన్.. సో థింక్ డిఫరెంట్

ABOUT THE AUTHOR

...view details