అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు ధాటికి దేశంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. భారీ హిమపాతం కారణంగా ప్రజలు ఎటూ కదలలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి శీతాకాలంలో ఇక్కడ మంచు కురవడం సర్వసాధారణమే అయినా... ఈ సారి తుఫాను కూడా తోడు కావడంతో పరిస్థితుల మరింత కఠినంగా మారిపోయాయి. గతానికి భిన్నంగా భారీ స్థాయిలో హిమం రోజుల తరబడి కురుస్తూనే ఉంది. అతిశీతల గాలులు సైతం తోడై పరిస్థితుల్ని భీకరంగా మార్చేశాయి. అమెరికాలో దాదాపు అన్ని రాష్ట్రాలు కకాలికలం అవుతుండగా.. టెక్సాస్ రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
అమెరికాను వణికిస్తోన్న మంచు తుపాను ఫిబ్రవరి 16 నాటికే... అమెరికాలోని 73.2 శాతం భూభాగం మంచుతో నిండిపోయిందని... అక్కడి వాతావరణ సంస్థలు ప్రకటించాయి. గతంలో 2011 జనవరి 12లో మాత్రమే ఆ స్థాయిలో దేశాన్ని మంచు కప్పివేసిందని తెలిపాయి. హిమపాతం స్థాయిలోనే పెరుగుదల నమోదయ్యింది. 2003 తర్వాత ఇదే తీవ్రమైన హిమపాతమని అక్కడి సంస్థలు ప్రకటించాయి. మంచు తుపాను కారణంగా యూఎస్‌లోని టెక్సాస్ నుంచి మైనే వరకు 14 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొంత కాలం కొనసాగే అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో తూర్పు టెక్సాస్, అర్కాన్‌సస్, దిగువ మిస్సిసిప్పీ లోయలో మరింత మంచు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
గడ్డకట్టించే చలి గాలుల కారణంగా... టెక్సాస్, లూసియానా, కెంటకీ, ఉత్తర కరోలినా, మిస్సోరీలో ఇప్పటికే కొన్ని మరణాలు నమోదయ్యాయి. రానున్న కాలంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న తూర్పు అమెరికా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడి 14 రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు. విద్యుత్ పరికరాలు పనిచేయకపోవడం, తీవ్ర గాలులకు చెట్టు పడిపోయి... విద్యుత్ తీగలు తెగిపోవడం సహా వివిధ కారణాలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అన్నింటి కంటే ముఖ్యంగా... ప్రజల వినియోగం భారీ స్థాయిలో పెరిగడంతో జాతీయ గ్రిడ్ పడిపోయే ప్రమాదాలు ఎదురవుతున్నాయి. దీంతో అధికారులే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను నిలిపివేసి.. గ్రిడ్‌కు రక్షణ కల్పిస్తున్నారు.
మొత్తంగా దేశంలో 10 కోట్ల మంది విద్యుత్ కోతల్ని ఎదుర్కొంటుండగా ఒక్క టెక్సాస్‌లోనే 40 లక్షల మందిపై ఈ ప్రభావం పడింది. ఇక్కడ రోజుల తరబడి విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్... టెక్సాస్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫెడరల్ ప్రభుత్వం నుంచి యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించాలని ఆదేశించారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజన్సీ నుంచి 60 జనరేటర్లు కావాల్సిందిగా అభ్యర్థించింది టెక్సాస్ ప్రభుత్వం. వీటిని అత్యవసరంగా... ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లకు తరలించి విద్యుత్‌ను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. స్థానిక ప్రజలను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 35 సంరక్షణాశాలలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన గవర్నర్...అక్కడ వెయ్యి మంది బాధితులకు సేవలందిస్తున్నట్లు తెలిపారు.
గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రతల నుంచి రక్షణ పొందేందుకు విద్యుత్ పరికరాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు అక్కడి ప్రజలు. శరీరం, ఆహార పదార్ధాలు, ఇంటిని వెచ్చగా ఉంచేందుకు వివిధ రకాల విద్యుత్ పరికరాలు వాడుతుంటారు. ప్రస్తుతం విద్యుత్ అవసరాల దృష్ట్యా ఆయా పరికరాల వినియోగాన్ని వీలున్నంత మేర తగ్గించాలని.... ఏకంగా రాష్ట్రాల గవర్నలే ప్రత్యేక విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో కనిష్ఠస్థాయిలో మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రక్తం గడ్డకట్టుకుపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. తక్షణం విద్యుత్ సరఫరా లేకపోతే... రోగులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గడ్డకట్టించే ఉష్ణోగ్రతల నుంచి రక్షణకు ప్రజలే తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. మూగ జీవాల బాధలు మరింత దయనీయంగా ఉన్నాయి. అతిశీతల ఉష్ణోగ్రతలు.. విపరీతమైన చలిగాలుల కారణంగా సంరక్షణ కేంద్రాల్లోని వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. శాన్ ఆంటోనియో ప్రైమరీ ప్రిమెట్స్ అభయారణ్యంలోని పెద్ద సంఖ్యలో జంతువులు మృత్యువాత పడ్డట్లు గుర్తించారు. వాతావరణం వెచ్చగా ఉంచేందుకు విద్యుత్ లేకపోవడంతో అధికారులు ఏం చేయలేకపోతున్నారు. కొన్ని తాత్కాలిక ఏర్పాట్లు చేసినా అవి చలి నుంచి రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. టెక్సాస్‌లోని ఓ సంరక్షణాలయంలో ఓ చింపాంజీ సహా... పదుల సంఖ్యలో కోతులు, లెమూర్లు, లెక్కలేనన్ని పక్షులు చనిపోయాయి. విస్తారమైన సంరక్షణాలయంలో ఇంకెన్ని జంతువులు మృతి చెందాయో తెలియదంటున్న నిర్వహకులు... ప్రస్తుతం ఈ ప్రదేశం ఓ శవాగారంగా మారిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
వన్యప్రాణులను రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అధికారులు... మంచు తీవ్రత ఎక్కువగా ఉన్న టెక్సాస్ సంరక్షణాలయాల నుంచి కొన్ని జంతువులను వేరే చోటుకి తరలిస్తున్నారు. వీటిలో కొన్నింటిని ఓక్లహామా సరిహద్దులోని శాన్ ఆంటోనియో జంతు ప్రదర్శనశాలకు, దూరంగా ఉన్న మరో అభయారణ్యానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొన్నింటిని సంరక్షించేందుకు వాలంటీర్లు ముందుకు రాగా... వారికి తాత్కాలికంగా అధికారులు అప్పగించారు. ఇంకో 33 చింపాంజీలు మాత్రం అభయారణ్యంలోనే మిగిలిపోయాయి. వీటిని పట్టుకోవడం, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలులేకపోవడంతో...వాటిని అక్కడే ఉంచారు. వీటి సంరక్షణ కోసమని ప్రైమరీ ప్రిమేట్స్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో విరాళాలు సేకరిస్తోంది.
రోడ్లపై విపరీతంగా కురుస్తున్న మంచు క్షణాల వ్యవధిలోనే గడ్డకట్టుకుపోతోంది. దీంతో నిలిపి ఉంచిన వాహనాలను కదిలించడానికి సాధ్యపడడం లేదు. ఈ కారణంగా రవాణా వ్యవస్థ మొత్తం స్థంభించిపోయింది. మందమైన మంచుపై వాహనాలు వేగంగా జారిపోతున్నాయి. ఫిబ్రవరి 14న ఒక్క హ్యూస్టన్ నగరంలోనే 120కి పైగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా.... ఓక్లాహామాకు దగ్గర్లోని ఓ ప్రధాన రహదారిపై పదుల సంఖ్యలో ట్రక్కులు ఒకదానితో ఒకటి ఢీకొని నిప్పుంటుకుని కాలిపోయాయి. అదే రోజున డల్లాస్‌లో 234 కార్లు ప్రమాదానికి గురయ్యాయని అక్కడి పోలీసులు వెల్లడించారు. మంచు కారణంగా...టెక్సాస్ సహా మరికొన్ని రాష్ట్రాలకు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. దేశీయంగా 5 వేలకు పైగా విమాన సర్వీసులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. మంచు ఎక్కువగా కురుస్తున్న రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి స్థానిక ప్రభుత్వాలు.
కరోనా వైరస్ మృత్యు కేంద్రంగా మారిన అమెరికాలో.. టీకా కార్యక్రమానికి మంచు తుఫాను తీవ్ర అడ్డంకిగా మారింది. టీకాలను తరలించడంలో ప్రధాన సమస్య ఎదురవుతుండగా.. వాటిని నిల్వచేయడం, ప్రజలకు ఇచ్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే.. చాలా రాష్ట్రాలు టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి అక్కడి ఆరోగ్య సంస్థలు. కొత్తగా ఇవ్వనున్న అపాయింట్‌మెంట్‌లనూ ఆపివేస్తున్నట్లు తెలిపాయి. వీటితో పాటే... కరోనా నిర్ధరణ పరీక్షలను అన్ని రాష్ట్రాల్లో నిలుపుదల చేశాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాతో పాటు... మధ్యప్రాచ్య దేశాలను మంచు దుప్పటి కప్పేసింది. చాలా దేశాల్లో కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో లేని తీరుగా... సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో తీవ్రస్థాయిలో మంచు కురిసింది. దక్షిణ లెబనాన్‌లోని మార్జాయౌన్ అనే పట్టణంలో, ఈశాన్య లిబియాలోని బేడాలో చరిత్రలో మొట్టమొదటి సారిగా మంచు కురిసింది. ఈ ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డట్లు స్థానిక వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఆయా దేశాల్లోని అత్యవసర సహాయక బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రభుత్వాలు ఆదేశాలు సైతం జారీ చేశాయి. ఇప్పటికే కొన్ని చోట్ల మంచులో కురుకుపోయిన కొంత మంది పౌరుల్ని సహాయక బృందాలు రక్షించాయి. ఇక సిరియాలో హమా ప్రావిన్సులో పెద్ద ఎత్తున యంత్రాలను రంగంలోకి దించారు. దట్టంగా పేరుకుపోయిన మంచును తొలగించేందుకు పెద్దపెద్ద బుల్డోజర్లు, మంచు కత్తిరించే యంత్రాలను వినియోగిస్తున్నారు.
సిరియాలో మంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుండగా... అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. యూనివర్శిటీ ఆఫ్ డెమాస్‌కస్ అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. శాశ్వత నివాసం లేని నిరుపేదలు.. ఈ వాతావరణ పరిస్థితులకు మరింత కష్టాల్లోకి కూరుకుపోతున్నారు. సిరియాలో కురుస్తున్న భారీ మంచు వర్షాలకు 10 వేలకు పైగా తాత్కాలిక నివాసాలు చెల్లాచెదురయ్యాయి. వారంతా.. చలిలోనే గడపుతున్నారు . లెబనాన్ రాజధాని సహా... ముఖ్య ప్రాంతాలకు దారితీసే రహదారుల్ని మూసివేశారు. ఇజ్రాయిల్‌లో సైతం ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తీవ్ర మంచు కారణంగా జెరూసలేంకు దారి తీసే టెల్ అవివ్-జెరూసలేం ప్రధాన దారిని మూసివేశారు. మంచు కారణంగా ఫిబ్రవరి 18ని అధికారిక సెలవు దినంగా జోర్డాన్ ప్రధానమంత్రి ప్రకటించారు. ఈజిఫ్టులోనూ తీవ్ర చలిగాలులు వీస్తుండడంతో పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను ఇప్పటికే మూసివేశారు.