జహీరాబాద్‌లోని మహీంద్రా ట్రాక్టర్ల(Mahindra tractors) కర్మాగారం మరో ఘనత సాధించింది. 20 అశ్వికశక్తి(హెచ్‌పీ) సామర్థ్యంతో పనిచేసే తేలికపాటి కే2 సిరీస్ ట్రాక్టర్ల (Mahindra K2 Project) ఉత్పత్తిని ప్రారంభించింది. సంస్థ వ్యవసాయ యంత్ర విభాగం ఛైర్మన్ హేమంత్ సిక్కా బుధవారం ప్లాంట్‌ని సందర్శించారు. ఆ వివరాలతో మంత్రి కేటీఆర్‌కు (MINISTER KTR) ట్వీట్ చేశారు. ఈ ట్రాక్టర్లను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనిపై మంత్రి కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు.
రూ.100 కోట్ల పెట్టుబడితో విస్తరణ
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ (Mahindra & Mahindra Company) జహీరాబాద్‌లో 2012లో దేశంలోనే అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏటా లక్ష ట్రాక్టర్లు తయారవుతున్నాయి. తద్వారా ప్రపంచంలో అత్యధిక ట్రాక్టర్ల తయారీ సంస్థగా మహీంద్రా గుర్తింపు పొందింది. సంస్థ విస్తరణలో భాగంగా గత ఏడాది నవంబరులో జపాన్‌కు చెందిన మిత్సుబిషితో కలిసి కే2 సిరీస్ ట్రాక్టర్ల (Mahindra K2 Project) తయారీ ప్లాంట్‌ని చేపట్టింది. ఇందుకు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టింది. మరో 1500 మందికి ఉపాధి కల్పించింది. పది నెలల వ్యవధిలోనే ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి.. 37 రకాల ట్రాక్టర్ల తయారీని ప్రారంభించింది. వీటిని ప్రధానంగా అమెరికా, జపాన్, దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలో విక్రయించేందుకు ఆ సంస్థ సన్నద్ధమవుతోంది.