తెలంగాణ

telangana

ETV Bharat / city

శివనామస్మరణలతో మార్మోగిపోయిన శైవ క్షేత్రాలు

రాష్ట్రవ్యాప్తంగా మహా శివరాత్రిని పురస్కరించుకుని.. శివ పార్వతుల కల్యాణోత్సవాలు వైభవోపేతంగా సాగాయి. ప్రధాన శైవ క్షేత్రాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శివనామస్మరణలతో ఆలయప్రాంగణాలు మార్మోగిపోయాయి.

శివనామస్మరణలతో మార్మోగిపోయిన శైవ క్షేత్రాలు
శివనామస్మరణలతో మార్మోగిపోయిన శైవ క్షేత్రాలు

By

Published : Mar 12, 2021, 3:55 AM IST

మహాశివరాత్రిని భక్తులు ఆనందోత్సాల మధ్య జరుపుకున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు.. రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

వేయి స్తంభాల ఆలయంలో..

హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో.. శివ పార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. మహాశివ రాత్రి ఉత్సవాల సందర్భంగా.. ఆలయ ఆవరణలో నిర్వహించిన కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పరవశించి పోయారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు... స్వామి వారి కల్యాణ తలంబ్రాలు, శేష వస్త్రాలు ఆలయ అర్చకులు అందజేశారు.

అంగరంగ వైభవంగా..

వరంగల్ అర్బన్ జిల్లా శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో తీరొక్క రంగవల్లులతో ఏర్పాటు చేసిన పెద్ద పట్నం చూపరులను ఆకట్టుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వరా స్వామి శుభానంద దేవిల కల్యాణోత్సవం.. మంత్రోచ్ఛరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో శివపార్వతుల కల్యాణోత్సవంలో... మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు పాల్గొన్నారు.

ఘనంగా శివపార్వతుల కల్యాణం

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్గాం శివమల్లన్న స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని శ్రీ జ్యోతిరవస్తు విద్యాపీఠంలో వేడుకలు వైభవోపేతంగా సాగాయి. రాత్రి అష్టోత్తర పారాయణం ఘనంగా నిర్వహించారు. నల్గొండ పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయంలో.. కల్యాణ మహోత్సవంలో సుమారు 200 జంటలు పాల్గొన్నారు. తుంగతుర్తిలోని శివాలయంలో ఎమ్మెల్యే గాదరికిషోర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకటలాడింది. శివుని సన్నిధిలో జాగరణ చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హైదరాబాద్‌ మాదాపుర్ శిల్పారామంలో "శివ భక్త మార్కండేయ " కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రముఖ నాట్య గురువర్యులు శ్రీమతి మద్దాలి ఉష గాయత్రీ శిష్య బృందం ప్రదర్శించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details