తెలంగాణ వ్యాప్తంగా శైవఆలయాలన్నీ తెల్లవారుజామునే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పెద్దఎత్తున తరలివస్తోన్న భక్తులు పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాష్ట్రంలోని శివాలయాలన్ని పరమశివుని నామస్మరణతో మార్మోగుతున్నాయి.
యాదాద్రి కొండపై వైభవంగా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున నుంచి ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం రాత్రి లింగోద్భవ కాలమున మహాన్యాస పూర్వకశత రుద్రాభిషేకములు నిర్వహించారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలిరావడంతో కోవెల సందడిగా మారింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
ప్రసిద్ధ వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా సాగుతున్నాయి. శివరాత్రి పురస్కరించుకుని రాజన్న సన్నిధిని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పురజనులకు సర్వదర్శనం కల్పించారు. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 4 గంటల వరకు ఆలయాన్ని శుద్ధి చేశారు. ఉదయం 4.25 గంటల నుంచి 6 గంటలవరకు ఆలయ అర్చకులు ప్రాతఃకాల పూజ చేశారు.
రాష్ట్రప్రభుత్వం, తితిదే తరఫున ప్రజాప్రతినిధులు, అధికారులు రాజరాజేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కల్యాణమండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి 11.35 గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరపనున్నారు. వేములవాడ రాజన్న సన్నిధికి తెల్లవారుజామునే చేరుకున్న భక్తులు.. స్వామివారికి మొక్కలు చెల్లిస్తున్నారు.
శివరాత్రి సందర్భంగా వేములవాడకో హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంచారు. శివరాత్రి జాతరను గగనతలం నుంచి వీక్షించేందుకు పర్యటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేములవాడ నుంచి నాంపల్లి వరకు 7 నిమిషాలకు ఒక్కరికి రూ.3 వేలు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. వేములవాడ నుంచి నాంపల్లి మీదుగా మధ్యమానేరు వీక్షణకు అవకాశం కల్పిస్తున్నారు. మధ్యమానేరు వీక్షణకు 15 నిమిషాలకు రూ.5,500గా అధికారులు నిర్ణయించారు.