Lungs transplant in NIMS: నిమ్స్ ఆసుపత్రిలో మొట్టమొదటి సారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స దిగ్విజయంగా పూర్తయింది. కొవిడ్‌తో ఊపిరితిత్తులు దెబ్బతిన్న 19 ఏళ్ల యువతికి ఈరోజు(డిసెంబర్ 1) నిమ్స్‌లో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. నవంబర్ 27న సుశీల అనే 47 ఏళ్ల మహిళ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సుశీల జీవన్మృతురాలు(బ్రెయిన్‌డెడ్) అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నిమ్స్ వైద్యులు సుశీల కుటుంబాన్ని సంప్రదించగా.. వారు ఆమోదం తెలిపారు. సుశీల ఉపిరితిత్తులను సేకరించిన వైద్యులు యువతికి అమర్చారు.
lung transplantation surgery: ఉదయం సుమారు 7.40 నిమిషాలకు మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రి నుంచి సుశీల ఊపిరితిత్తులను సేకరించారు. అప్పటికే ఏర్పాటు చేసిన గ్రీన్‌ఛానెల్ ద్వారా కేవలం 11 నిమిషాల్లోనే నిమ్స్‌కి లంగ్స్‌ను తరలించారు. ఆస్పత్రిలో సిద్ధంగా ఉన్న వైద్యులు.. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తులను యువతికి అమర్చారు. ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నా ఊపిరితిత్తుల మార్పిడి వీలు కాలేదని... సుశీల అవయవాలతో తమ కూతురికి తిరిగి ప్రాణం పోశారని యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Brain dead woman organ donation: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన ఎగ్గె సుశీల(47) బతుకు దెరువుకోసం గత 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడే పనులు చేస్తూ జీవనం సాగించేవారు. నవంబర్ 28న హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడం వల్ల హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందించగా... బ్రెయిన్‌డెడ్ అయింది. జీవన్ దాన్ సంస్థ సహకారంతో మృతురాలి కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు దానం చేశారు. రెండు కిడ్నీల్లో ఒకటి నిమ్స్, మరొకటి అపోలో ఆస్పత్రికి తరలించారు. రెండు కార్నియాలను ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానాకు అందించారు. రెండు ఊపిరితిత్తులు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 19 ఏళ్ల యువతికి వినియోగించారు.
organ donation awareness: నిజానికి అవయవ దానం అనేది గొప్ప దానం. దీనిపై అందరికీ అవగాహన కలిగించడానికి ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. కాగా.. గ్రామీణ ప్రాంతానికి చెందిన సుశీల కుటుంబసభ్యులు... అవయవదానానికి ముందుకు వచ్చారు. ఆమె చనిపోయినా... మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించటం హర్షనీయం. సుశీల చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపారు.
సంబంధిత కథనం..