తెలంగాణ

telangana

ETV Bharat / city

TDP MLC Ashokbabu arrest: అశోక్‌బాబు అరెస్టుపై సీఐడీకి హైకోర్టు ఆదేశాలు..!

TDP MLC Ashokbabu arrest: తప్పుడు ధ్రువపత్రంతో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేశారన్న ఫిర్యాదు మేరకు తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయగా.. ఆయన బెయిల్​ పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్​ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.

TDP MLC Ashokbabu arrest
TDP MLC Ashokbabu arrest

By

Published : Feb 11, 2022, 4:23 PM IST

TDP MLC Ashokbabu arrest: తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబును అరెస్టు చేయటంపై ఏపీ హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్​పై విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అశోక్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అశోక్‌బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

అశోక్ బాబు అరెస్ట్.. ఎందుకంటే..?

తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును గురువారం(ఫిబ్రవరి 10న) రాత్రి సమయంలో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని నివాసం నుంచి రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన్ను తరలించారు. గురువారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన అశోక్‌బాబు రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు.

అప్పటికే అక్కడ మఫ్టీలో మాటు వేసిన సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అశోక్‌బాబును అరెస్టు చేసినట్లు, కోర్టులో హాజరపరచనున్నట్లు సమాచారం ఇస్తూ ప్రకాశం జిల్లా కందుకూరు వాసి మాదాల గోపికి నోటీసు అందించారు. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా, చదివినట్లు తప్పుడు ధ్రువపత్రాన్ని సమర్పించారనీ, మరికొన్ని ఆరోపణలతో విజయవాడ వాసి మెహర్‌కుమార్‌.. లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపిన లోకాయుక్త.. వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి ఫిర్యాదు చేయాలని ఆ శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌ డి.గీతామాధురి ఇటీవల అశోక్‌బాబుపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 477ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద గత నెల 25న కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్టు చేశారు.

సర్వీస్‌ మేటర్స్‌లో తప్పుడు కేసుతో ఇరికించారు: చంద్రబాబు

తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్‌ మేటర్స్‌లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పునకు మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. అర్ధరాత్రి అశోక్‌బాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నందునే ఆయనపై కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది కోర్టులో నిలబడే కేసు కాదని, అక్కడే పోరాడి తేల్చుకుంటామని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ చెప్పారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details