అనధికార ప్లాట్లు, అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల పరిష్కార కార్యాచరణకు పురపాలక శాఖ శ్రీకారం చుడుతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వీటిని పరిష్కరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు అనుసరించాల్సిన విధానం, అందుబాటులోకి తీసుకురావాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై పురపాలక, పట్టణ ప్రణాళిక ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమవారానికే రాష్ట్ర వ్యాప్తంగా మూడులక్షలకుపైగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చాయి. పురపాలక శాఖ మొదట్లో ఇచ్చిన జీవో ప్రకారం వచ్చే నెల 15 వరకు గడువు ఉంది. అయితే, గడువు పూర్తయ్యేవరకూ వేచి చూడకుండా త్వరలోనే తదుపరి ప్రక్రియను ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు, శిఖం భూముల్లోనివి, నదులు, నాలాలు, కాలువలకు నిర్దేశించిన దూరంలో లేనివాటిని తొలిదశలోనే గుర్తించి తిరస్కరిస్తారు. ఈ పరిశీలనలో పొరపాట్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. పరిశీలన అధికారులను బాధ్యులుగా చేయనున్నారు.
ఫీజు పూర్తిగా చెల్లిస్తే..
తొలుత ప్రాథమిక దరఖాస్తు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మొదటి పేజీని మాత్రం తీసుకుంటున్నారు. అవి సక్రమంగా ఉంటేనే తదుపరి ప్రక్రియకు పరిగణిస్తారు. ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా 22ఏలో లేని వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. బృహత్ ప్రణాళిక ప్రకారం ఉందా? లేదా? అని నిర్ధారించుకుని దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు శ్రీకారం చుడతారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటికి ఇతర నిర్దేశించిన డాక్యుమెంట్లను అందించడంతోపాటు, ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపునకు మూడు నెలల గడువు ఇస్తారు. ముందుగానే పూర్తి ఫీజు కట్టిన దరఖాస్తులను ప్రాధాన్యక్రమంలో పరిష్కరిస్తారు.