ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మన్యంలో చలి విజృంభిస్తోంది. ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే బెంబేలెత్తున్నారు. లంబసింగిలో అయితే అత్యల్పంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో అది 3 డిగ్రీలుగా ఉంది. మినుములూరులో 9, పాడేరులో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా...
ప్రస్తుత లంబసింగి, చింతపల్లిలో నమోదైన ఉష్ణోగ్రతే రికార్డు అని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం ఆర్‌ఏ డాక్టర్ సౌజన్య తెలిపారు. సాధారణంగా డిసెంబరు నుంచి జనవరి రెండో వారం వరకు మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అవుతుంటాయని, సంక్రాంతి తరువాత నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతుంటాయని ఆమె వెల్లడించారు. జనవరి చివరి వారంలో ఐదు డిగ్రీలకన్నా తక్కువ నమోదు కావడం చాలా అరుదని, 2006 జనవరి 28వ తేదీన మూడు డిగ్రీలు నమోదు కాగా, మళ్లీ 16 ఏళ్ల తరువాత 3 డిగ్రీలు నమోదైందని డాక్టర్ సౌజన్య పేర్కొన్నారు.