పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తోడు ఏళ్లుగా డైట్ ఛార్జీలు పెంచకపోవడంతో ఆస్పత్రుల్లో రోగులకు అందించే ఆహారంలో నాణ్యత కొరవడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కో రోగికి ఉదయం అల్పాహారంతోపాటు రెండు పూటలా సాధారణ భోజనానికైతే రూ.40 చొప్పున, హైప్రొటీన్ డైట్‌కు రూ.56 చొప్పున ప్రభుత్వం గుత్తేదారుకు చెల్లిస్తోంది. వైద్యులకు ఉదయం అల్పాహారంతోపాటు రెండుపూటలా భోజనానికి రూ.80 చొప్పున ఇస్తోంది. 2011 కంటే ముందు రోగులకు రూ.20, వైద్యులకు రూ.40, హైప్రోటీన్ డైట్ ఛార్జీ రూ.28 ఉండేది. ప్రతి ఆసుపత్రిలో రోగుల మెనూను సక్రమంగా పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, వడ, మధ్యాహ్నం భోజనంలో పప్పు, కూర, సాంబారు, ఉడకబెట్టిన గుడ్డు, అరటి పండు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల పెట్రో, వంటగ్యాస్ ధరలు పెరగడంతో కార్మికుల వేతనాలు ఇతర ఖర్చుల వల్ల గత్యంతరం లేని స్థితిలో ఆహార పంపిణీ నాణ్యత విషయంలో రాజీ పడాల్సి వస్తోందని గుత్తేదారులంటున్నారు.
నిలోఫర్‌లో కిచిడీనే..
నిలోఫర్‌లో రోగులకు కిచిడీ, సాంబారు, అన్నం, నీళ్లలాంటి మజ్జిగే దిక్కు. 1-16 సంవత్సరాల పిల్లలు, నిండు గర్భిణులకు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సుమారు వెయ్యిమంది రోగులకు రుచికరమైన ఆహారం అందించాలి. పురుడు పోసుకున్న తల్లులకు అధిక ప్రోటీన్ల భోజనం పంపిణీ చేయాలి. ఇక్కడి భోజనంలోనూ నాణ్యత లేదని రోగులు వాపోతున్నారు. ఇప్పటికే ఆహార పంపిణీకి సంబంధించి రూ.2.5 కోట్ల కుంభకోణం జరగగా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయినా పరిస్థితులు మారలేదు. అధిక ప్రోటీన్ ఆహారంలో గుడ్డు, ఏదైన ఒక పండు ఇవ్వాలి. ఎక్కువగా ఒక్క అరటిపండు మాత్రమే ఇస్తున్నట్లు చెబుతున్నారు. పిల్లలకు మాత్రం పాలు, బ్రెడ్ ఇస్తారు. రోగికి ఇచ్చే ఆహారంలోనే సహాయకులు కూడా సర్దుబాటు చేసుకొని తింటుంటారు. కొన్నిసార్లు ఆ ఆహారం సరిపోక దాతలు పెట్టే వాటి కోసం ఎదురు చూస్తుంటారు. ఒక్కో రోగికి భోజన ఛార్జీగా ప్రభుత్వం రూ.40 ఇస్తుంటే నిలోఫర్‌లో కాంట్రాక్టర్లు పోటీపడి రూ.36కే ఇస్తామని టెండర్లు వేయడం గమనార్హం.
రోగుల మెనూ..
* ఉదయం.. ఇడ్లీ లేదా ఉప్మా
* మధ్యాహ్నం.. భోజనంలో 600 గ్రాముల అన్నం, కూర పప్పు, సాంబారు, ఉడకబెట్టిన గుడ్డు, అరటి పండు
* రాత్రి.. 450 గ్రాముల అన్నం, కూర, పప్పు, సాంబారు, మజ్జిగ
వైద్యుల ఆహార పట్టిక