కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా మార్చి 20 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశం నిలిపివేసిన తితిదే... నిబంధనల సడలింపుతోనేటి నుంచి ప్రయోగాత్మకంగా దర్శనాలను పునఃప్రారంభించింది. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో దర్శనాలకు అనుమతిస్తూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో నేటి నుంచి శ్రీవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. కరోనా ప్రొటోకాల్ ప్రకారం.... వైరస్ వ్యాప్తి నియంత్రణకు తితిదే పకడ్బందీ చర్యలు తీసుకుంది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి శ్రీవారి సన్నిధి వరకు పటిష్ఠ చర్యలు చేపట్టింది. భక్తుల మధ్య భౌతిక దూరం, శుభ్రత తప్పనిసరి చేసింది.
థర్మల్ స్క్రీనింగ్.. తనిఖీలు
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను అలిపిరి తనిఖీ కేంద్రంలో నిశితంగా పరిశీలించేలా... థర్మల్ స్క్రీనింగ్ సహా... వాహనాల తనిఖీలకూ ఏర్పాట్లు చేశారు. దర్శనానికి టికెట్లున్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అన్నప్రసాద భవనం, కల్యాణకట్ట ప్రాంతాల్లో.... భౌతిక దూరం పాటించేలా... మార్కింగ్ చేశారు. భక్తులకు అవగాహన కల్పించేందుకు వివిధ ప్రాంతాల్లో 3 భాషల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భక్తులకు దగ్గరగా సేవలందించే సిబ్బంది కోసం.... పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. వెంగమాంబ అన్నదాన సత్రంలో వెయ్యి మంది సామర్థ్యం ఉన్న ఒక్కో హాలుకు... 200 మందిని మాత్రమే అనుమతించడం... కల్యాణకట్టల్లో క్షురకుల మధ్య 10 అడుగుల దూరంతో పాటు అవసరమైన ప్రతిచోటా విస్తృత ఏర్పాట్లు చేశారు.