దేశం, భాష, సంస్కృతి ఏదైనా.. భక్తిభావం మాత్రం ఒక్కటే. అందుకే వారి వారి భావాలననుసరించి, సంప్రదాయాలననుసరించి ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. భారతీయులు ఆదిపూజ ఆ వినాయకుడికి సమర్పిస్తారు. అలాగే సంకట హరుడుగా, శుభకరుడుగా గణేషుడిని ఆరాధిస్తారు. కేవలం మనదేశంలోనే కాదు.. కొన్ని ఇతర దేశాల్లో కూడా గణేషుడు పూజలందుకోవడం విశేషం.
థాయ్‌లాండ్‌లో..
థాయ్‌లాండ్‌లో కూడా వినాయకుణ్ణి విఘ్నాలను బాపే దైవంగానే పూజిస్తారు. ఆ దేశమంతటా వినాయకుడి ఆలయాలు ఉన్నాయి. థాయ్‌లాండ్‌వాసులు ఆ గజాననుణ్ణి 'ఫ్రా ఫికనెట్' గా కొలుస్తారు. ఆ దేశ 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్' చిహ్నం కూడా మన గజముఖుడే! అక్కడ వినాయక ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. భారతీయులు నవరాత్రులుగా ఉత్సవాలు చేసుకుంటే.. వారు మాత్రం పదిహేను రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఆఖరున వినాయక నిమజ్జనం కనుల పండువగా జరుగుతుంది.
అంతేకాక ఇక్కడ ప్రత్యేకంగా వినాయక విగ్రహాలతో కూడిన మ్యూజియం ఉంది. ఖున్ పన్డారా తీరకనాన్డ్ అనే వ్యక్తి 'గణేష్ హిమాల్' అనే మ్యూజియాన్ని నిర్వహిస్తున్నాడు. తన చిన్నతనంలో అతని తండ్రి ఓ వినాయకుడి బొమ్మను బహుమతిగా ఇచ్చాడట. అప్పటినుంచీ వినాయకుడంటే అతనికి ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టంతోనే వినాయకుడి బొమ్మలను, పెయింటింగ్‌లను సేకరించి, మ్యూజియం ఏర్పాటు చేశాడు. వెయ్యికి పైగా వినాయకుడి కళాకృతులు ఉన్నాయీ మ్యూజియంలో.
ఐర్లాండ్‌లో..
ఐర్లాండ్‌లోని కౌంటీ విక్లోకు సమీపంలో 'విక్టోరియా వే' పార్కు ఉంది. బెర్లిన్‌కి చెందిన విక్టర్ లాంగ్‌హెల్డ్ అనే పెద్దాయన దీని యజమాని. ఆయన వివిధ భంగిమల్లో ఉన్న వినాయకుడి విగ్రహాలు చెక్కించి, ఆ పార్కులో ప్రతిష్ఠించాడు. వీటిని తమిళనాడుకు చెందిన భారతీయ శిల్పులే చెక్కడం విశేషం. వీటితోపాటుగా ఉపవాసం చేస్తున్న బుద్ధుడు, శివలింగం, పరమేశ్వరుడి రూపాలు కూడా ఈ పార్కులో ఉన్నాయి.