Special Recipes for Ganesh Chaturthi : దేవతల్లోకెల్లా తొలి పూజ అందుకునే దైవం మన బొజ్జ గణపయ్య.. ఏ పూజ అయినా.. ఏ కార్యమైనా ఆయనను పూజించడంతోనే ప్రారంభమవుతుంది. వినాయకచవితి రోజున స్వామికి భక్తిశ్రద్ధలతో పూజ చేశాక... నైవేద్యాన్ని నివేదించడం తెలిసిందే. ఆ వంటకాల్లో ఈసారి స్వామికి ఇష్టమైన పదార్థాలను ఇలాంటి రుచుల్లో చేస్తే సరి. అలాంటివాటిలో కొన్నిటి గురించి చూద్దాం రండి...
బెల్లం సొజ్జప్పాలు
కావలసినవి: మైదా: అర కప్పు, బొంబాయిరవ్వ: కప్పు, నెయ్యి: టేబుల్‌స్పూను, ఉప్పు: అరచెంచా. స్టఫింగ్‌కోసం: తాజా కొబ్బరి తురుము: కప్పు, ఎండుకొబ్బరిపొడి: అరకప్పు, బెల్లం తరుగు: ఒకటిన్నర కప్పు, గసగసాలు: రెండు టేబుల్ స్పూన్లు, రవ్వ: రెండు టేబుల్ స్పూన్లు, యాలకులపొడి: చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం: ఓ గిన్నెలో మైదా, రవ్వ, నెయ్యి, ఉప్పు తీసుకుని అన్నింటినీ కలుపుకోవాలి. ఆ తరువాత నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా చేసుకుని దానిమీద తడి వస్త్రాన్ని కప్పి గంటసేపు నాననివ్వాలి. స్టౌమీద బాణలిని పెట్టి గసగసాలు, రవ్వను విడివిడిగా వేయించుకోవాలి. అదే బాణలిలో బెల్లం తరుగు వేసి.. పావు కప్పు నీళ్లు పోయాలి. బెల్లం కరిగాక కొబ్బరితురుము, కొబ్బరిపొడి వేసి స్టౌని తగ్గించి కలుపుతూ ఉండాలి. ఇది దగ్గరకు అవుతున్నప్పుడు యాలకులపొడి, రవ్వ, గసగసాలు వేసి కలిపి స్టౌని కట్టేయాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని...చిన్న చపాతీలా ఒత్తుకోవాలి. అందులో ఒకటిన్నర చెంచా కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి... అంచుల్ని జాగ్రత్తగా మూసి మళ్లీ ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి. వీటిని గాలి తగలని డబ్బాలో వేసుకుంటే వారం వరకూ నిల్వ ఉంటాయి.
డ్రైఫ్రూట్స్ మోదక్
కావలసినవి: ఖర్జూరాలు: ఒకటిన్నర కప్పు, బాదం-జీడిపప్పు-కిస్‌మిస్: పావుకప్పు చొప్పున, ఎండుకొబ్బరిముక్కలు: పావుకప్పు, గసగసాలు: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: చెంచా.
తయారీ విధానం: ముందుగా బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరిముక్కలు, గసగసాలను విడివిడిగా వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో నెయ్యి వేయాలి. అందులో కిస్‌మిస్, ఖర్జూరాలను వేసి రెండు నిమిషాలు వేయించి దింపేయాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఆ తరువాత మోదక్ అచ్చులో ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి నొక్కితే... డ్రైఫ్రూట్స్ మోదక్ తయారైనట్లే. ఇదేవిధంగా మిగిలిన మిశ్రమాన్నీ చేసుకోవాలి.
బెల్లం-రవ్వ ఉండ్రాళ్లు
కావలసినవి: బొంబాయిరవ్వ: అరకప్పు, బెల్లం తరుగు: అరకప్పు, తాజా కొబ్బరి తురుము: పావుకప్పు, పెసరపప్పు: టేబుల్‌స్పూను (అరగంట ముందు నానబెట్టుకోవాలి), యాలకులపొడి: పావుచెంచా, నెయ్యి: రెండు చెంచాలు, నీళ్లు: కప్పు.