తెలంగాణ

telangana

ETV Bharat / city

LOKESH: నిరుద్యోగులను సీఎం జగన్‌ నిండా ముంచారు: నారా లోకేశ్ - నిరుద్యోగులతో లోకోశ్​ వర్చువల్ సమావేశం

ఏపీలో ఉద్యోగాల భర్తీపై పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయకపోతే.. సీఎం జగన్‌ జాదూరెడ్డిగా చరిత్రలో మిగిలిపోతారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. 'జాబ్ లెస్ క్యాలెండర్‌తో నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం- భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ' అనే అంశంపై లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు.

nara lokesh comments on cm jagan
జగన్​పై నారా లోకేశ్​ విమర్శలు

By

Published : Jul 1, 2021, 2:38 PM IST

"జగన్ మోహన్​ రెడ్డి నిరుద్యోగులను నిండా ముంచారు" అని ఏపీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. చేసిన మోసానికి యువతతో పాటు వారినే నమ్ముకున్న కుటుంబాలు మనోవేదనతో రగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'జాబ్ లెస్ క్యాలెండర్ తో నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం - భవిష్యత్తు, ఉద్యమ కార్యాచరణ' అనే అంశంపై నిరుద్యోగ యువతతో నారా లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో నిరుద్యోగం పెరిగి 300 మంది వరకు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్నారని లోకేశ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. 7లక్షలకు పైగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఉన్నారనే నివేదికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని వెల్లడించారు.

ఆత్మలతో మాట్లాడటం ఆపండి

"కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోగా మోసపూరిత క్యాలెండర్ విడుదల చేశారు" అని లోకేశ్​ విమర్శించారు. మైసూర్ బోండాలో మైసూర్ లేనట్లే జగన్ మోహన్​ రెడ్డి జాబ్ క్యాలెండర్​లో జాబులు లేవని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చి రెండేళ్లలో 10వేల ఉద్యోగాలు ముష్టి వేశారని దుయ్యబట్టారు. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి అంతరాత్మతో మాట్లాడితే ఇచ్చిన హామీలు గుర్తొస్తాయన్నారు. పాదయాత్రలో ప్రచారానికి పనికొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు పనికిరాకుండా పోయారా.. అని నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉద్యమాలు చేయనివ్వకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని లోకేశ్‌ ఆక్షేపించారు.

జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలని... పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా 2.30 లక్షల ఉద్యోగాలతో కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని లోకేశ్​ డిమాండ్‌ చేశారు. కొత్త జాబ్ క్యాలెండర్​లో గ్రూప్ 1, గ్రూప్ 2 విభాగాల్లో 2 వేల పోస్టులు ఉండేలా విడుదల చేయాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా 6500 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భ‌ర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో 20వేలకు పైగా ఖాళీలకు నియామ‌కాలు చేప‌ట్టాలని వెల్లడించారు. రెవెన్యూ శాఖలో 740 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయాలన్న లోకేశ్​.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెలాఖరులోగా డిమాండ్లన్నీ పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని నారా లోకేశ్‌ హెచ్చరించారు.

నిరుద్యోగులను సీఎం జగన్‌ నిండా ముంచారు. రెండేళ్లలో ఉద్యోగాలు లేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. జాబ్ క్యాలెండర్ పేరిట జగన్ రెడ్డి జాదూ క్యాలెండర్ విడుదల చేశారు. మైసూర్ బోండాలో మైసూర్ ఉండనట్లే జాబ్ క్యాలెండర్‌లో జాబ్స్ లేవు. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపితే ఇచ్చిన హామీలు గుర్తొస్తాయి. 38 శాతం నిరుద్యోగ రేటుతో దేశంలో 4వ స్థానంలో ఏపీ ఉంది. నిరుద్యోగులపై కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. 2.30 లక్షల ఉద్యోగాలతో కొత్త క్యాలెండర్ విడుదల చేయాలి. డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం.-నారా లోకేశ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి:Bandi Sanjay: దేశంలో అలాంటి ఏకైక ముఖ్యమంత్రి.. కేసీఆర్​ మాత్రమే..!

ABOUT THE AUTHOR

...view details